సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. అబీద్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు.
టీడీపీ నాయకుడు పట్టాభి రోజువారీ కూలీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే ఆయన పని అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారని విమర్శించారు. కార్యక్రమం అనంతరం 48 గంటల పాటు నిర్వహించే జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే గణేష్ పార్టీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.