Site icon NTV Telugu

Minister Nimmala: వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు..

Nimmala

Nimmala

Minister Nimmala: విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. అప్పుడు మేము పోరాటం చేశాం.. కానీ, 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో రాష్ట్రం మరింత దారుణంగా నష్టపోయిందని ఆరోపించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీదున్న రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. పురాణాల్లో రాక్షసుల నుంచి ప్రజలను కాపాడిన కథలు విన్నట్లే, ఇప్పుడూ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి నిమ్మల అన్నారు.

Read Also: Sentiment Star : ఒక్క డిజాస్టర్ దెబ్బకు 15ఏళ్ల సెంటిమెంట్ ను పక్కన పెట్టిన స్టార్ హీరో

అయితే, గతంలో పోలవరం గురించి అర్థం కాలేదని వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నేటికీ గుర్తున్నాయని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇప్పుడు వాళ్లు పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన నాయకులు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అలాగే, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది.. కానీ, తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తిచేసి నీరు విడుదల చేశామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం.. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చే లక్ష్యంతో చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి రామానాయుడు వెల్లడించారు.

Read Also: Karela Benefits: వర్షాకాలంలో కాకరకాయను ఎందుకు తినాలి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

ఇక, వైఎస్ జగన్ మాటలు చూస్తే, తలకాయకి- మామిడి కాయకి తేడా తెలియకుండా ఉన్నట్టు ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ సద్దతులను అనుసరిస్తున్న వైసీపీ నాయకులు బ్లేడు, గంజాయి, బెట్టింగ్ రాయుళ్లను పరామర్శిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని జగన్ చెప్పినప్పటికీ, ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూశాం.. అయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. గత ఐదేళ్లలో అనేక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం విడిచిపోయారు.. కానీ, ఇప్పుడు జగన్ మళ్లీ అధికారంలోకి రాడన్న నమ్మకంతో ఆంధ్ర వైపు తిరిగి చూస్తున్నారు.. అలాగే, బనకచర్ల ప్రాజెక్ట్‌కి 2 టీఎంసీలు నీరు వాడతాం.. త్వరలో సీడబ్ల్యూసీ అనుమతులతో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తాం.. గోదావరి నుంచి ఏడాదికి 3 వేల టీఎంసీలు నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా, జగన్ మాత్రం మిగులు జలాలు లేవని కామెంట్స్ చేయడం దారుణమని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version