KK Line: అరకు రైలు ప్రయాణం పర్యాటకులను ఫిదా చేస్తుంది. కొండలు, గుట్టలు, లోయలు దాటుకుని పచ్చటి అడవుల్లో టన్నెల్స్ గుండా సాగిపోయే జర్నీ మరపురాని అనుభూతి. విశాఖ నుంచి దాదాపు 120 కిలో మీటర్లు సాగిపోయే ఈ పర్యాటక రైలు మార్గం ఇంత కాలం వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉండేది. విస్టాడోమ్ కోచ్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది.. అయితే, విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు అధికారికంగా కేంద్రం ఆమోదించడంతో పాటు రూట్ మ్యాప్ పిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం జోన్ పరిధిలోకి తెస్తూనే కీలకమైన కేకే లైన్ ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్పు చేసింది. కొత్తవలస – కిరండోల్ భాగమైన అరకు రైల్వే స్టేషన్ పై తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్నది. అంతే కాదు కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్‌కి అత్యధిక ఆదాయం తెచ్చేది కూడా. దీనిని వదలుకోవడం అంటే విశాఖ రైల్వే డివిజన్‌కు ఆర్థికంగా నష్టమే.
Read Also: Hyundai Creta: ఏంటి భయ్యా ఈ కారుకు ఇంత డిమాండ్.. అసలేముంది ఈ హ్యుందాయ్ క్రెటాలో
ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ 446 కిలోమీటర్ల మేర ఈ మార్గం సాగిపోతుంది. 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్లలో 48 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కేకే లైన్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి.. విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ రోజుకు 10 నుంచి 12 వ్యాగన్ల రవాణా జరుగుతుంది. ఏటా 10 వేల కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా. గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా కేకే లైన్‌లో విశాఖ నుంచి మూడు, రాయగడ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ఈ విధంగా బహుముఖ ప్రయోజనాలు ఉన్న కేకే లైన్ విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలని నిరసనలు ఊపందుకుంటున్నాయి.
అరకు రైల్వే స్టేషన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కోరుతూ అరకు ఎంపీ తనుజారాణి వినతి పత్రం అందజేశారు. రాయగడ డివిజన్‌లో విలీనం చేయడాన్ని తమ ప్రాంతవాసులు అంగీకరించబోరని చెప్పారు. అటు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం హైకమాండ్ దృష్టికి ప్రజల అభిప్రాయం తీసుకుని వెళ్ళింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. పర్యాటకంగా ఆంధ్రా ఊటీగా పేరుపొందిన అరకు, అరకు రైల్వే స్టేషన్ ఎమోషనల్‌గా బాగా కనెక్టైన అంశాలు. అరకుకు వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి ప్రాంతాన్ని విడదీశారు అనే భావన తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది.