NTV Telugu Site icon

Vizag Drugs Case: మళ్లీ తెరపైకి వైజాగ్‌.. ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్..

Vizag Drugs Case

Vizag Drugs Case

Vizag Drugs Case: విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు విలువైన 25 వేల కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతి పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని పొలిటికల్ డిమాండ్ ఊపందుకుంది. 2024 మార్చి 19న సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజులు ముందు… ఏపీ రాజకీయాలను దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ.. సీబీఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్టు కేసు నమోదు చేసింది. ఇంటర్ పోల్ సమాచారం ఆధారంగా కంటైనర్ టెర్మినల్ – VCTPLలో తనిఖీలు చేసి 25 వేల కేజీల డ్రైఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఆక్వా ఫీడ్ తయారీలో వాడే ఈస్ట్ కంటైనర్ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుక పకడ్బందీ వ్యూహం వుందని అనుమానం కలిగింది. ప్రత్యేక బృందాలు కంటైనర్ తెరవగా డ్రగ్స్ అవశేషాలు వున్నట్టు తేలింది. ఈ కన్సైన్ మెంట్ ను సంధ్యా ఆక్వా బుక్ చేసింది. పరిశ్రమ అవసరాల కోసం బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి డ్రైఈస్ట్ దిగుమతి చేసుకుంది సంధ్యా ఆక్వా. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు, అనుమానిత పదార్థాలు గుర్తించినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది.

అయితే ఒక్కో బ్యాగ్‌లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించింది. తూర్పు తీరంలో ఈ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డం దేశవ్యాప్త సంచలమైంది. ఐతే, కంటైనర్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని ఎటువంటి విచారణ కైన సిద్ధమేనని సంధ్యా అక్వా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు విచారణ మందగమనం ఆరోపణలు చేస్తూ వైసీపీ పలు అనుమానాలు లేవనెత్తింది. విశాఖపట్నం ఔన్నత్యానికి మచ్చ తీసుకొచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే బాధ్యత ఉత్తరాంధ్ర ఎంపీలదే అంటున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ కోణం లేదంటూనే మాదకద్రవ్యాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరిస్తుందన్న బలమైన ఆరోపణ బొత్స చేశారు. దీనిపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని ఆయన ఎంపీలకు సూచిస్తున్నారు.

మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తు న్న సీబీఐ శాంటోస్ పోర్టుకు, డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంలో షిప్ ఆగిన పోర్టుల్లో ఆధారాలు సేకరించాలని నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ఇంత వరకూ ఎటువంటి పురోగతి ఉందనేది బహిర్గతం కాలేదు. ఎన్నికల ముందు విశాఖ డ్రగ్స్ వ్యవహారం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు దారి తీసింది. సీబీఐ విచారణ పరిధిలో ఉన్న అంశం కావడంతో అప్పటి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించలేదన్న అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగు అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ప్రకటించింది. అదిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే, డ్రగ్స్ కేసులో ఏపీ ప్రభుత్వం వైఖరిని వైసీపీ ప్రశ్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తుండగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిత దృష్టిసారించారు.