Vizag Steel Plant Protest: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యం కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది. అయినప్పటికీ ఈడీ ఆఫీసు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారులను బయటికి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ వద్ద, ఈడీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. కాంట్రాక్టు పీరియడ్ ఉన్నంత వరకైనా కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఇలా అర్థాంతరంగా తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని పలు యూనియన్లు సంస్థను కోరాయి.
Read Also: Mahalaya Amavasya 2024: నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలు తక్షణమే నిలుపుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలన్నారు. అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం లడ్డుపై కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకై పని చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించాయి.