CII Partnership Summit 2025: విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు రోజుల పాటు జరిగే ఈసదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా. సదస్సులో భాగంగా మూడు రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తోంది.
Read Also: Bihar Election Results 2025 LIVE Updates: బీహార్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. లైవ్ అప్‌డేట్స్..
CII 30వ భాగస్వామ్య సదస్సు 2025లో.. 19 ప్లీనరీలు జరగనున్నాయి. ఇందులో పలువురు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక, వ్యాపార వేత్తలు పాల్గొంటున్నారు. ఏకకాలంలో వేరువేరు సమావేశ హాళ్లలో మూడు ప్లీనరీలు సమాంతరంగా జరుగనున్నాయి. సీఐఐ సదస్సు ప్రారంభం తర్వాత.. టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. తర్వాత సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక సాయంత్రం ఏపీలో ఆర్థికశాఖ నిర్వహించే ‘రీ ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమిట్’లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ఛైర్మన్‌తో సమావేశంలో.. వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్‌లో లూలూ గ్రూప్ నిర్మించే మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
శనివారం ఉదయం జరగనున్న బ్లూమ్‌బర్గ్ మీడియా సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆ తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జపాన్, కెనడా, న్యూజిలాండ్, బహ్రెయిన్, ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే.. ‘సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్’ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల ప్రోగ్రాం ఉంటుంది.
