Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

  • రుషికొండ భవనాల వినియోగంపై సర్కార్‌ కీలక నిర్ణయం..
  • రుషికొండ భవనాలను లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సిద్ధం..
  • ఆపరేషన్ & మెయింటెనెన్స్ కోసం EOI కోరుతూ నోటిఫికేషన్..
Rushikonda Buildings

Rushikonda Buildings

Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ పర్యాటక భవనాలు నిర్మించబడ్డాయి. అయితే నిర్మాణాలపై రాజకీయ వివాదాలు, న్యాయపరమైన అంశాలు కొనసాగుతుండటంతో పాటు, రెండేళ్లుగా భవనాలు వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వంపై భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల దాదాపు రూ.25 లక్షలు వ్యయం అవుతోంది.

రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై అధ్యయనం చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం లీజు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పలువురు పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రుషికొండ నిర్మాణాలకు సంబంధించి తీర ప్రాంత నియంత్రణ మండలి (CRZ) నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT), న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు నిర్మాణాలకు అనుమతుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.