Gautam Reddy Car Fire: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్‌తో అక్కడికి వచ్చాడు. ఆ బ్యాగ్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను కారుపై పోసి, అనంతరం నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గత నెల 12వ తేదీన జరిగినట్లు సమాచారం. తన కారుకు మంటలు అంటుకున్న ఘటనపై గౌతమ్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి పొన్నం ప్రభాకర్.. సిద్ధమా..?
అయితే, సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితుడు స్పష్టంగా కనిపించినప్పటికీ, అతడి వ్యక్తిత్వం ఇంకా గుర్తించలేకపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, గౌతమ్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అసలు ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఎవరి పని? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.