AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితి నెలకొంది.. పై స్థాయిలో సీట్ల పంపకం పూర్తి అయినట్టు కనిపిస్తున్నా.. కింది స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేన మూడు నియోజకవర్గాల్లో కలిపి 30 సీట్లు కావాలని పట్టుబడుతుండగా, టీడీపీ మాత్రం 17 సీట్లకు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా మూడు నియోజకవర్గాల్లో కలిపి 10 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.
జనసేనకు 30 సీట్లు కావాలంటూ పట్టుబాటు
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 10 సీట్ల చొప్పున మొత్తం 30 సీట్లు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు సమాచారం. అయితే, టీడీపీ మాత్రం మూడు నియోజకవర్గాల్లో కలిపి 17 సీట్లకు మాత్రమే అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక, సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. జనసేన తరఫున సమన్వయకర్త ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, బీజేపీ జిల్లా నాయకులు కూడా చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం.
సెంట్రల్లో తగ్గేదేలే అంటున్న బోండా ఉమా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు ఐదు సీట్లకు మించి కేటాయించలేమని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో సెంట్రల్ నియోజకవర్గంలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.
బీజేపీకి 10 సీట్లు కావాలి
మరోవైపు, విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 10 సీట్లు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలపై సమన్వయం సాధించాల్సి ఉండటంతో చర్చలు కీలకంగా మారాయి.
వంగవీటి రాధా కోసం జనసేన జాబితా సిద్ధం?
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు ఖరారైన నేపథ్యంలో, జనసేన పార్టీ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే, సీట్ల పంపకాలపై తుది ఒప్పందం కుదిరిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశం
సీట్ల పంపకాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడకపోవడంతో కూటమి నేతలు మరోసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, బీజేపీ డిమాండ్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సెంట్రల్ నియోజకవర్గంలో సమస్య ఎలా పరిష్కారమవుతుందన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.

