Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని, యువతకు 66 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. కుల, మతాలకు అతీతంగా యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.

175 స్థానాల్లో పోటీ చేస్తాం.. సామాజిక న్యాయమే లక్ష్యం
2029 ఎన్నికల్లో పీఆర్పీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని విజయసాయిరెడ్డి బలంగా చెప్పారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, పార్టీ తరఫున 66 శాతం టికెట్లు యువతకు కేటాయిస్తామని ప్రకటించారు. కుల, మత భేదాలకు అతీతంగా యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇక, రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణపై సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని విమర్శించారు. దేవాలయాల పాలక మండళ్లు రాజకీయ నిరుద్యోగులకు ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపించారు. దేవుళ్లపై నిజమైన విశ్వాసం, భక్తి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. దేవుళ్లపై భక్తులకున్న నమ్మకం, విశ్వాసాల పట్ల గౌరవం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మతపరమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారు?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ఆదాయం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రాష్ట్రంలో ఎలాంటి సంపద సృష్టించాయని, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశాయని నిలదీశారు. అప్పులు చేయడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించారో చెప్పాలని ప్రశ్నించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే పరివర్తన రాజనీతి పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.

అవినీతి, అక్రమాలకు తావులేని రాజకీయాలే లక్ష్యం
రాష్ట్రంలో స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావడమే పీఆర్పీ లక్ష్యమని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తమ పార్టీలో అవినీతికి, అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. క్లీన్ పాలిటిక్స్ కోసం పరివర్తన రాజనీతి పార్టీ పనిచేస్తుందని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పిస్తూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా పార్టీని నిర్మిస్తామని చెప్పారు. కాగా, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీకి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)గా పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులతో రూపొందించిన జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 175 స్థానాల్లో పోటీ చేయడంతో పాటు యువతకు 66 శాతం అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో పీఆర్పీపై ఆసక్తి నెలకొంది.