MLA Kolikapudi New Controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుమారడంలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొలికపూడి… సొంత పార్టీ నేతలతోనే కెలుక్కోవడంలో ముందుంటారు. ఆయన తీరు… ఒక్కోసారి మంచికి పోతున్నా చెడు ఎదురవుతున్న పరిస్థితి. స్థానిక నేతలతో వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలతో కొలికపూడి బిజీగా ఉంటారు. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాఫియాలను పెంచి పోషిస్తున్నారన్నారు. తనకు టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ అంశాన్ని క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు… క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. క్రమశిక్షణా కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ వివాదం ఇంకా చల్లారకముందే… మరో విషయంలో నిప్పు రాజేశారు.
Read Also: AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు
కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్… టీడీపీలో ప్రకంపనలకు కారణమవుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేశారు కొలికపూడి. నువ్వు దేనికి అధ్యక్షుడివి..? పేకాట క్లబ్‌కా..? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్నీ వర్గం అనే ప్రచారం ఉంది. ఆయన్ని లక్ష్యంగా చేసుకునే ఇలా వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారు కొలికపూడి శ్రీనివాసరావు. కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లు తిరువూరులో హాట్ టాపిక్‌గా మారాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. అయితే, కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్‌పై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది..? ఈ అంశాన్ని కూడా క్రమశిక్షణా కమిటీకి అప్పజెబుతుందా..? మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకుంటారా..? అనేది చూడాలి. కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లపై టీడీపీ ఎలా స్పందిస్తుంది..?