MP Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఎస్కార్ట్ వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా ఇవాళ్టితో మిథున్ రెడ్డి రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అలాగే, లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఐదు రోజుల పాటు ఆయనను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిల్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
Read Also: Asia Cup 2025: అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి గత 59 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై బయటకు వెళ్లి తిరిగి ఈ నెల 11న జైలులో సరెండర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పిటిషన్ మేరకు కస్టడీకి ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే నాలుగు సార్లు మిథున్ రెడ్డి రిమాండ్ ను పొడిగిస్తూ వచ్చినప్పటికీ, ఇంత వరకు సిట్ అధికారులు కస్టడీకి కోరలేదు. దీన్ని సవాల్ చేస్తూ కస్టడీ పిటిషన్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు మధ్యాహ్నానికి కోర్టులో తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది.