Vijayawada Floods: విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ. ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులుగా నియమించారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను బెజవాడకు రప్పిస్తోంది ప్రభుత్వం.. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, గుంటూరు కమిషనర్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Dunzo: ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించిన డన్జో..
వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లో ఎంతో కష్టపడి బాధితులను బయటికి తీసుకొచ్చాం. దాదాపు బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశాం. ఇవాళ 8.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు టిఫిన్ కోసం, మరో 8.5 లక్షల అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశాం. 5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని వివరించారు. నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాం. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం అన్నారు.. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేకాధికారి ఉంటారు. వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంటుతో కలిసి ట్యాంకర్లతో రోడ్లు శుభ్రం చేస్తాం. బ్లీచింగ్, ఫాగింగ్ పనులు వెంటనే చేపడతాం. వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని వివరించారు..