Vijayawada GGH Doctor Death: బెజవాడ జీజీహెచ్‌లో కలకలం..! డ్యూటీలో ఉన్న యువ డాక్టర్‌ దీపిక మృతి.. ఏం జరిగింది..?

  • విజయవాడ GGHలో కలకలం..
  • డ్యూటీలో ఉన్న సమయంలో యువ డాక్టర్‌ దీపిక మృతి..
  • MBBS పూర్తి చేసి మెడిసిన్ పీజీ చేస్తున్న అనంతపురానికి చెందిన దీపిక ..
Vijayawada Ggh Doctor Death

Vijayawada Ggh Doctor Death

Vijayawada GGH Doctor Death: బెజవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో డ్యూటీలో ఉన్న ఓ యువ వైద్యురాలి మృతి కలకలం రేపింది. తెల్లవారుజామున ఆసుపత్రి వార్డులోనే డాక్టర్ దీపిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా చెందిన దీపిక, ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లో మెడిసిన్ విభాగంలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చదువుతోంది. నిత్యం లాగే నిన్న రాత్రి కూడా ఆమె డ్యూటీకి హాజరైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Read Also: Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే

అయితే, ఆసుపత్రి వార్డులో డ్యూటీలో ఉన్న సమయంలోనే, తెల్లవారుజామున దీపిక అపస్మారక స్థితిలో పడిపోయినట్టు సమాచారం. విధుల్లో ఉన్న ఇతర వైద్యులు వెంటనే ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, దీపిక నిన్న రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా చికిత్స కోసం ఇంజెక్షన్ తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, దీపిక చేతిపై ఇంజెక్షన్ తీసుకున్న గుర్తులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ ఇంజెక్షన్ ఏ మందుకు సంబంధించినది, అది వైద్యపరంగా అనుమతించబడినదేనా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అనంతపురం నుంచి దీపిక తల్లిదండ్రులు విజయవాడకు చేరుకున్న తర్వాత, వారి ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. అవసరమైతే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని అంశాలు వెలుగులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అయితే, డ్యూటీలో ఉన్న సమయంలోనే ఓ యువ వైద్యురాలు మృతి చెందడం జీజీహెచ్ వైద్యులు, పీజీ విద్యార్థుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహచరులు దీపిక మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలి అకస్మిక మృతి వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.