Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి

Sai Krishna Missing Case

Sai Krishna Missing Case

Sai Krishna Missing Case: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసులో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీస్తామని హామీ ఇచ్చారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె నుంచి తెలుసుకున్న సీఎం, కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం గాదె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందని తెలిపారు. సాయి కృష్ణ కేసులో అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. సాయి కృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ.. కుటుంబం ఎదుర్కొంటున్న బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ తరహా ఘటనలు మరెవరికీ జరగకూడదని ఆకాంక్షించారు. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని, దర్యాప్తులో ఎవరికైనా తప్పు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు.

×
×
Ad

తమ కుటుంబానికి రాజకీయ పార్టీలతో గానీ, కులాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని నవరంగ్ పేర్కొన్నారు. అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి తమకు భరోసా కల్పించిందని, ఇకపై తమ కుటుంబాన్ని వివాదాల్లోకి లాగకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.