Vijayawada Floods: ఓవైపు కృష్ణా నది వరద.. మరోవైపు.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడ సిటీ అతలాకుతలం అయ్యింది.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు తిష్ట వేయగా.. చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది.. అయితే.. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం.. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు సిబ్బంది.. ఏపీ వ్యాప్తంగా ఉన్న వందలాది ఫైరింజన్లలో మెజార్టీ ఫైర్ ఇంజిన్లు బెజవాడకు రప్పించారు.. ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.. మరోవైపు.. వరద ఆనవాళ్లను కడిగి పరిశుభ్రం చేయడానికి.. నీరు సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లును పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు..
వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది పురపాలక శాఖ.. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం.. ఈ సాయంత్రం 4 గంటలవరకూ రోడ్లపై చెత్తను తొలగించేందుకు విధుల్లో పాల్గొన్నారు 4498 మంది కార్మికులు.. 48 ఫైర్ ఇంజన్ ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు.. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా సహాయక చర్యలు చేపట్టింది సర్కార్.. మొత్తం 149 సచివాలయాల పరిధిలో ఉన్న 32 వార్డుల్లో వరద ప్రభావం ఉండగా.. ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు దిగారు.. మరోవైపు.. విజయవాడలో వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన జీవీఎంసీ అధికారులు ,ఉద్యోగులు.. 1400 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు తరలించింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్.. ఇక, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్నారు పారిశుద్ధ్య కార్మికులు..