NTV Telugu Site icon

Vijayawada Floods: రేపటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ.. రేషన్‌కార్డు లేకుంటే ఆధార్‌తో..

Nadendla Manohar

Nadendla Manohar

Vijayawada Floods: వరదలతో అతలాకుతలం అయిన విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వంతో పాటు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు.. ప్రజలు.. ఇలా తమకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు.. ఫుడ్‌, వాటర్‌, బిస్కెట్లు.. మందులు ఇలా చేరవేస్తున్నారు.. ఇక, వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనుంది ఏపీ పౌరసరఫరాల శాఖ.. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది.. 179 వార్డు,3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణీ చేపట్టనున్నారు.. ముంపు బాధితులు అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…

Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విజయవాడ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ఎన్నో వరదలను చూశామని.. కానీ, ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతోందన్నారు. శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని 179 వార్డు, 3 గ్రామ సచివాలయాల పరిధిలో వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి పాయలు, 2 కిలోల బంగాళా దుంపలను రెండు బ్యాగులుగా చేసి పంపిణీ చేస్తామన్నారు.

Read Also: Bangladesh: హసీనా సైలెంట్‌గా ఉండాలి లేకపోతే ఆమెకి, భారత్‌కి మంచిది కాదు.. బంగ్లా చీఫ్ వార్నింగ్..

ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీని చేపట్టి మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు మంత్రి మనోహర్‌.. ఇపోస్ మిషన్లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బాధితులను గుర్తించడం జరిగిందని.. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. మరోవైపు.. శుక్రవారం విజయవాడలో 12 ప్రాంతాల్లో గ్యాస్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.. వరదలకు దెబ్బతిన్న బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు బీపీసీఎల్,హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ కంపెనీల ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని మంత్రి మనోహర్ వెల్లడించారు.

Show comments