Ambati Rambabu: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసు ముందు ఆందోళన దిగారు వైసీపీ నేతలు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగుతున్నాయి.. అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Also:Bandi Sanjay: అసత్యాలు మాట్లాడారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసు!
ఓటరు స్లిప్పులు దౌర్జన్యంగా లాక్కుని వాళ్లు మనుషులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారు.. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదన్నారు అంబటి రాంబాబు.. గతంలో నంద్యాలలో ఇదే తరహాలో చేసి గెలిచారు.. ఆ తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. ఒక్క గ్రామాల్లోని వ్యక్తులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నారు.. ప్రజాప్రతినిధులను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఇక్కడకు వచ్చి ఓట్లు వేశారు అని ఫైర్ అయ్యారు.. దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం.. ఈనెల 5వ తేదీ నుంచి చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా చెబుతూనే ఉన్నాం.. టీడీపీ, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కలిసిపోతే ఇంకా ఏం చేస్తాం అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. మీరు చేసే దుర్మార్గాలను అర్ధం చేసుకుని ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
Read Also: Undermine : మిమ్మల్ని చులకనగా చూసే వారికి ఈ ఒక్క సమాధానం..
మా ఓటు మేం వేసుకోలేదని వందల మంది బయటకు వస్తున్నారు.. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. మా పులివెందుల అభ్యర్థి గన్ మెన్ ను కూడా ఇవాళ అకస్మాత్తుగా మార్చేశారు.. మీరు చేసిన ప్రతి పనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు.. అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపుకోసం తాపత్రయపడుతున్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
