NTV Telugu Site icon

Vijay Sai Reddy: చిదంబరాన్ని అరెస్ట్ చేయాలి.. ఎంపీ హాట్ కామెంట్స్

Saichidam

Saichidam

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివ‌ర్ణించిన సాయిరెడ్డి.. ఆయ‌న‌ను త‌క్షణ‌మే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయిరెడ్డి వ‌రుస‌గా 5 ట్వీట్లు సంధించారు. చిదంబ‌రానికి అసలు నైతిక‌తే లేద‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ క‌ళాశాల‌లు చిదంబ‌రం వ్యవ‌హారాల‌ను కేస్ స్టడీలుగా తీసుకోవాల‌ని తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మ‌నీ ల్యాండ‌రింగ్ నుంచి చైనా పౌరుల‌కు లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించార‌ని చిదంబ‌రంపై సాయిరెడ్డి మ‌రింత ఘాటు విమ‌ర్శలు గుప్పించారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబ‌రం ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాల‌కు పాల్పడ్డార‌ని ఆయన ఆరోపించారు. తాను చేసిన అన్ని త‌ప్పుల‌కు చిదంబ‌రం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన స‌మయం ఆస‌న్నమైంద‌ని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. త‌క్షణ‌మే చిదంబ‌రంను అరెస్ట్ చేయాల‌ని ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా పోస్ట్ చేసిన సాయిరెడ్డి… 2004- 14 మ‌ధ్యలో కేంద్ర మంత్రి హోదాలో చిదంబ‌రం తీసుకున్న అన్ని నిర్ణయాలు, వ్యవ‌హారాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు ప‌రిస్థితి అంతా తారుమారైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చిదంబ‌రం విత్తిన పాపం ఇప్పుడు ఫ‌లాలు ఇస్తోంద‌ని కూడా సాయిరెడ్డి సెటైర్ సంధించారు. జాతి వ్యతిరేక కార్యకలాపాల‌కు పాల్పడ్డ చిదంబ‌రం కోట్లాది ధ‌నాన్ని సంపాదించార‌ని ఆయ‌న ఆరోపించారు. చిదంబ‌రం ఆర్థిక‌, రాజ‌కీయ అంశాల‌పై ధైర్యంగా ఉప‌న్యాసాలు ఇచ్చిన వైనం ఇప్పటిదాకా త‌న‌కు అర్థమే కాలేద‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప‌ట్టప‌గ‌లే దోపిడీల‌కు పాల్పడ్డార‌ని చిదంబ‌రంపై ఆయన విరుచుకుప‌డ్డారు. దేశంలో పేదలు మరింతగా ద‌రిద్రంలో కూరుకుపోయేలా చిదంబ‌రం వ్యవహ‌రించార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

ఇదిలా వుండగా.. ఇవాళ ఉదయం పి.చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించాయి.. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల ఈ సోదాలు జరిగాయి.. తనయుడు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 2010 నుంచి 2014 మధ్య కాలంలో కార్తీ చిదంబం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలు వచ్చాయి.. కార్తీ చిదంబరం తన తండ్రి పి. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించినందుకు INX మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (FIPB) క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది. ఈ సోదాలపై చిదంబరం సెటైర్లు వేశారు.

Chidambaram: సీబీఐ సోదాలు.. చిదంబరం సెటైర్లు..!