Vidadala Rajini Started New 104 108 Vehicles In AP: గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 20 చొప్పున 108, 104 వాహనాలను ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి వైఎస్సార్ పునాది వేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఆ రంగాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల్ని మరింత మెరుగు చేసేందుకు రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 104, 108 వాహనాల ద్వారా 25 వేల మందికి ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తామని వెల్లడించారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై విడదల రజిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్, చంద్రబాబుల ముసుగు తొలగిపోయిందని.. విశాఖ సంఘటనను అడ్డం పెట్టుకొని ఇద్దరూ బయటపడ్డారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష దారుణంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతం కావడంతో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ ఈ అలజడి సృష్టించారని మండిపడ్డారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డిపై బిజెపీ నేతలు విమర్శలు చేసే ముందు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
అంతకుముందు.. పవన్‌కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడని, పవన్‌లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను నమ్ముకుంటే, కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా ఉంటుందన్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ పయనిస్తున్నాడని విమర్శించారు. ఆ తర్వాత.. అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని పేర్కొన్నారు. బాబు, కరువు.. కవల పిల్లలని ఎద్దేవా చేశారు.