ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్ 13, జూలై 1 లలో ఇప్పటి వరకు రెండు సార్లు అచ్చెన్నాయుడి సంతకం, లెటర్ హెడ్‌లను ఫోర్జరీ చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడి నకిలీ లెటర్‌హెడ్‌ను ఉపయోగించి ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 2022 జూలై 1న అచ్చెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామనే నకిలీ లేఖను విడుదల చేశారని వర్ల రామయ్య తెలిపారు.
Read Also:MS Dhoni: ధోనీకి మోకాలి శస్త్రచికిత్స.. ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
2022 జూన్ 29, 30 తేదీల్లో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేశారంటూ నకిలీ లేఖను సర్క్యులేట్ చేశారనే నెపంతో ఇద్దరు అమాయకులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని.. వారిపై కస్టోడియల్ హింసకు పాల్పడటమే కాకుండా వారిని కరడుగట్టిన నేరస్థులుగా ముద్రవేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగించారని వర్ల రామయ్య ఆరోపించారు. అచ్చెన్నాయుడు పేరుతో విడుదల చేసిన నకిలీ లేఖల ఫోర్జరీ సైతం విజయమ్మ కేసు తరహాలోనే భావించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను గతంలో చేసిన ఫిర్యాదులకు, ప్రస్తుత ఫిర్యాదుకు సంబంధించి తీసుకున్న చర్యలు తెలియజేయాలని కోరుతున్నట్లు లేఖలో వర్ల రామయ్య వివరించారు.