Site icon NTV Telugu

Varla Ramaiah : సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah

Varla Ramaiah

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్‌ మీడియాతో నిరాధరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ మద్దతుదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని వైసీపీ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారని, మా పార్టీ సభ్యుల్లో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ హ్యాకర్లు నా ట్విట్టర్ ఖాతాను ఫోర్జరీ చేశారని ఆరోపించారు వర్ల రామయ్య.

వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని టీడీపీ నుండి సస్పెండ్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ ఖాతాను ఫోర్జరీ చేసి ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ పెట్టారని ఆయన పేర్కొన్నారు. జోన్స్ పణితి అనే వ్యక్తి ప్రతిపక్షనేత చంద్రబాబు లెటర్‌హెడ్‌తో పాటు ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని ఆయన మండిపడ్డారు. ఫోర్జరీ సంతకంతో ఉన్న లెటర్ హెడ్ తో లేఖలు రాస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ విచారణ పేరుతో తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆయన అన్నారు.

వాస్తవ సంఘటనలపై సైతం స్పందించి చర్యలు తీసుకోవాలని, ఐటీడీపీ సమన్వయకర్త వెంకటేష్‌ను సీఐడీ కార్యాలయానికి పిలిచి విచారణ పేరుతో అసభ్య పదజాలంతో దుర్భాషలాడారన్నారు. సీఐడీ హెడ్ కానిస్టేబుల్ లోవరాజు, ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వార్డ్ విషయంలో నారా లోకేష్ చేసినట్లు ఒప్పుకోవాలని వెంకటేష్‌ను ఒత్తిడి చేసి బెదిరించారని, లోవరాజు సీఐడీ అదనపు డీజీపీకి విశ్వాసపాత్రుడని తెలిసిందన్నారు. విచారణ సమయంలో సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ లోవరాజు అత్యుత్సాహం ప్రదర్శిస్తాడని ఆయన లేఖలో ప్రస్తావించారు.

Exit mobile version