కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవడం కొవిడ్ తీవ్రతను కళ్లకు కడుతోంది. తొలుత ఈ రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు చాపకింద నీరులా దేశమంతా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీలో రికార్థు స్థాయిలో లక్షకు పైగా కేసులు బయటపడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా కేసులు బయటపడుతున్నాయి.
అయితే ఏపీలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. టీకా ఉత్సవ్ తర్వాత వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా వ్యాక్సినేషన్ కు బ్రేక్ పడింది. ఇవాళ తరలివచ్చిన టీకాతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది. ఈరోజు ఏపీలోని అన్ని జిల్లాలకు 6 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇప్పటికే పూణే నుంచి గన్నవరం 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి లక్ష కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు చేరుకోనున్నాయి. గన్నవరం స్టోరేజ్ పాయింట్ నుంచి 13 జిల్లాలకు తరలించనున్నారు.
జిల్లాలకు పంపిన కోవీషీల్డ్ డోసులు
శ్రీకాకుళం జిల్లాకు 23, 450
విజయనగరం 21,300
విశాఖపట్నం 51,450
తూర్పుగోదావరి 53,350
పశ్చిమగోదావరి 32, 700
కృష్ణ 42,650
గుంటూరు 56, 300
ప్రకాశం 31, 500
నెల్లూరు 26, 800
అనంతపురం 39, 900
చిత్తూరు 54, 800
కర్నూలు 39, 500
కడప 26, 300