Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే క్లారిటీ వచ్చింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023కే పూర్తి కావాల్సి ఉందని లోక్‌సభలో పేర్కొన్నారు ప్రహ్లాద్ సింగ్ పటేల్.
ఇక, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైనట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు పేర్కొంది.. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉందని.. జాప్యం జరిగినట్లు తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. తన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకూ రూ.13,077 కోట్లు కేటాయించామని, వీటిల్లో రూ.5,455 కోట్లను ఖర్చు చేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ మధ్యే శాసన మండలిలో ప్రకటించారు.. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. దీనికి సంబంధించి రూ 13,077 కోట్లను విడుదల చేసి రూ.5455.41 కోట్లను ఖర్చు చేశామని పేర్కొన్నారు. దేవీపట్నం మండలం చినరమణయ్యపేట శివార్లలో జరిగిన భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. అనర్హులైన ఏడుగురు 29.94 ఎకరాల భూమికి సంబంధించి రూ 2.24 కోట్లను అక్రమంగా కాజేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు.. ఈ అవకతవకలకు పాల్పడ్డ వారందరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.. ఇక, ప్రాజెక్టు నిర్మాణాన్ని 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారని దుష్ప్రచారం చేయడం సరైందికాదని వ్యాఖ్యానించిన ఆయన.. రెండు దశల్లో కలిపి మొత్తం 45.72 మీటర్ల ఎత్తు పూర్తి చేస్తామని స్పష్టం చేసిన విషయం విదితమే.