ఉక్రెయిన్-రష్యా వివాదంతో అక్కడ వేలాదిమంది భారతీయులు వందలాదిమంది తెలుగు రాష్ట్రాల వారు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణ బాబు చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలను వెనక్కి తీసుకుని రావటానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపడం పై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్.
విదేశాంగ శాఖ మంత్రితో సీఎం మాట్లాడారు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్లు- 85000 27678,0863-2340678. మాస్టర్ లిస్ట్ ఒకటి తయారు చేశాం. ఈ వివరాలను ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు అందజేస్తున్నాం అన్నారు కృష్ణ బాబు.ఒక ప్లైట్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముంబైకి చేరనుంది. ఏపీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ముంబయి, ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చెయ్యాలని సీఎం ఆదేశించారన్నారు. విమానాశ్రయాల్లో ఏపీ ప్లకార్డుతో సిబ్బంది ఉంటారు. ఏపీకి సంబంధించిన విద్యార్థులు వీరిని సంప్రదించవచ్చునని ఆయన సూచించారు. సరిహద్దుల్లోకి వెళ్ళ వద్దని భారత రాయబార కార్యాలయం సూచన చేసిందన్నారు. కేంద్రం సహకారంతో తెలుగు రాష్ట్రాల వారిని స్వస్థలాలకు తరలిస్తామన్నారు.