టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపిన పాలకమండలి.. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటిలో టీటీడీ కల్యాణమంటపం నిర్మాణానికి రూ.2.21 కోట్లతో టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, టీటీడీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్ తరహాలో టీటీడీ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇక, టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్‌కు ఆమోదం లభించగా.. తిరుమలలోని వరాహ స్వామి విశ్రాంతి భవనం`2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోద ముద్ర వేసింది. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి కూడా రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది టీటీడీ పాలకమండలి.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
