NTV Telugu Site icon

Tirumala: సామాన్య భక్తులకే పెద్దపీట

Ttd1

Ttd1

కలియుగ వైకుంఠం తిరుమలలో ఇకనుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు.

భక్తులు సౌకర్యార్ధం యాత్రికులు వసతి సముదాయంలో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాం. ఏప్రిల్ 24వ తేది నుంచి వయోవృద్దులు,వికలాంగులుకు ప్రత్యేక దర్శనాలు ప్రారంభించాం అని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేది వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. 2500 మంది శ్రీవారి సేవకులు ప్రతి నిత్యం భక్తులకు సేవలందిస్తున్నారు.

జమ్ము,సీతంపేట,అమరావతిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. ముంబాయిలో 70 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం అన్నారు. మే 21వ తేదీన భువనేశ్వర్ లోని శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. 18 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. మే 15 నుంచి 17వ తేదీ వరకు తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనార్థం వేచి వున్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,271 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు అని టీటీడీ తెలిపింది.కరోనా ప్రభావం తగ్గడం వల్ల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

ఢిల్లీలో బ్రహ్మోత్సవాలు

ఇదిలా వుంటే దేశ రాజధాని ఢిల్లీలోని గోలే మార్కెట్ లోని టీటీడీ బాలాజీ మందిర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మే 12న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మే 17న కళ్యాణోత్సవం, మే 22న పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 12 తేదీ నుంచి 22 తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ఉచితంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. తిరుపతి నుంచి వచ్చిన 30 మంది అర్చకుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కడు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉన్న ప్రముఖులు బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. ఢిల్లీ టీటీడీ స్థానిక సలహా కమిటీ సభ్యుల సొంత నిధులతోనే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

CRDA: ఈ-వేలం ద్వారా అమరావతి టౌన్ షిప్‌ స్థలాల అమ్మకం