Site icon NTV Telugu

TTD: భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలు.. అలా అయితేనే తిరుమలకు రావాలి..!

Ttd Eo Anil Kumar Singhal

Ttd Eo Anil Kumar Singhal

తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. తిరుమలలో సర్వదర్శనం క్యూ లైనలను పరిశీలంచిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, సర్వదర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ద్వారా టోకేన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం భక్తులు టోకెన్ పొందిన తర్వాతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రావాలని.. వారికి కేటాయించిన సమయానికి కృష్ణతేజా అతిధి గృహం వద్ద క్యూ లైనులోకి చేరుకోవాలని సూచించారు.. అంటే టోకెన్‌ పొందిన వారే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్.

Read Also: GVL Narasimha Rao: జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు.. కాపులు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక దిగరు..!

వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని చెప్పిన ఈవో.. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జెడ్పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని.. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తిరుమలకు ప్రయాణం పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇక, భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా.. టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. ఇక, జనవరి 4 నుండి జనవరి 11, 2023 వరకు తిరుమల వసతి కోటా బుకింగ్ కోసం అందుబాటులో ఉండనుంది.. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 2023 జనవరి 1, 2 మరియు 3 తేదీల్లో ఆన్‌లైన్ వసతి కోటా అందుబాటులో ఉండదని చెబుతున్నారు అధికారులు.

Exit mobile version