విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… కాపులు ఒకసారి అధికారంలోకి వస్తే ఇక దిగరని తెలిసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి కాపలా కాయాల్సిన అవసరం లేదని అన్ని పార్టీల్లో నేతలు గుర్తించాలన్న ఆయన.. స్టాలిన్ సినిమాలో విలన్‌ను గిరిలో పెట్టినట్టు.. కాపు నాయకులను గిరిగీసి పెట్టారు అంటూ ఆరోపించారు.. అందుకే వంగవీటి రంగా వర్ధంతికి రాకుండా నియంత్రణ చేశారన్న ఆయన.. సామాజిక న్యాయం కావాలంటే పార్టీలు గీసే గిరి దాటి బయటకు రావాలని పిలుపునిచ్చారు.. కాపులకు అధికారం లేని పదవులు వస్తున్నాయి.. సభకు రావొద్దంటే పదవులకు ఆశపడ్డ నేతలు డుమ్మా కొట్టారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు వంగవీటి రంగా అని పేర్కొన్న ఆయన.. రంగా హత్య దారుణమైన హింసాత్మక ఘటన.. రంగా ఎదుగుదలకు భయపడ్డారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన సత్తా ఏంటో.. మూడు సార్లు.. ముప్పై సార్లు గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కనుమరుగయ్యారు.. కానీ, రంగా ఎప్పటికీ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
Read Also: E-Luna: ఇక, ఎలక్ట్రిక్ ‘లూనా’.. నెలకు 5,000 సెట్లు మార్కెట్‌లోకి..!
ఇక, బీసీ-డీ రిజర్వేషన్లు పొందడం ఉత్తరాంధ్రలో ప్రతీ కాపు హక్కు అని స్పష్టం చేశారు జీవీఎల్ నరసింహారావు.. కులం కోటాలో పోస్టులు తెచ్చుకుంటున్న మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికిన ఆయన.. మంత్రులు అధినాయకత్వం గీసిన గిరిదాటి బయటకు వస్తే రాజకీయం ఏంటో అర్ధం అవుతందన్నారు. అసలు, వంగవీటి మోహన్ రంగా పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదు..? అని నిలదీసిన ఆయన.. ఈ డిమాండ్ ను వినిపించడంలో కాపు నాయకులు విఫలం అయ్యారంటూ ఫైర్ అయ్యారు.. వంగవీటి రంగా విగ్రహాన్ని ఆర్కే బీచ్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. కాపు నాడు తీర్మానం చేయాలని సభలో సూచించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక, ఎంపీ జీవీఎల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది కాపునాడు సభ.. ఈబీసి రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో చర్చించారు జీవీఎల్.. రిజర్వేషన్లపై ప్రధాన పార్టీల ఎంపీలు స్పందించలేదని కాపునాడు అసంతృప్తి వ్యక్తం చేసింది.. జాతి చిరకాల కోరికైనా రిర్వేషన్ల అంశం సాకారం అయ్యేవరకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.. కాపు రిజర్వేషన్ల గురించి పార్లమెంటులో ప్రస్తావించిన జీవీఎల్‌ను సన్మానించింది కాపునాడు.