మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో తిరునాళ్ల ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రభల వేడుక కన్నులపండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు చేశారు. నరసరావుపేట నుంచి నుంచి వచ్చే భక్తులు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మార్గంలో కొండకు చేరుకుని నాగిరెడ్డి గెస్ట్‌హౌస్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని తెలిపారు.
నరసరావుపేట నుంచి యల్లమంద మార్గంలో వచ్చే వారు జనరల్ పార్కింగ్‌లో వాహనాలు నిలపాలని పోలీసులు సూచించారు. వినుకొండ నుంచి వచ్చే భక్తులు ఘాట్‌రోడ్డు సమీపంలోని జనరల్ పార్కింగ్‌లో వాహనాలు నిలిపి.. ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని స్పష్టం చేశారు. యల్లమంద మార్గంలో తిరుగు ప్రయాణానికి అనుమతి లేదన్నారు. చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే వీఐపీ భక్తులు యూటీ జంక్షన్ నుంచి క్రషర్స్ మార్గంలో వీఐపీ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలని… అక్కడ వాహనాలు నిలిపి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి వెళ్లాలని పోలీసులు తెలిపారు.