Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం!

‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్‌గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా సారా తోపు హీరోయిన్ అనిపించుకుంది. చిన్నప్పుడే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. 20 ఏళ్లకే సారా ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది.

అస్సాంలో బంగ్లాదేశ్‌ ఉగ్ర మాడ్యుల్ భగ్నం.. 11 మంది అరెస్ట్..

అస్సాం పోలీసులు బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న అతిపెద్ద ఉగ్ర ముఠాను అరెస్ట్ చేశారు. భారత భద్రతా, నిఘా విభాగం ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాడ్యూల్‌ను అధికారులు భగ్నం చేశారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నసీమ్ ఉద్దీన్ అలియాస్ నజీముద్దీన్, అలియాస్ తమీమ్(24), జునాబ్ అలీ (38), అఫ్రాహిమ్ హుస్సేన్ (24), మిజానూర్ రెహమాన్ (46), సుల్తాన్ మెహమూద్ (40), మహ్మద్ సిద్ధిక్ అలీ (46), రషీదుల్ ఆలం (28), మహిబుల్ ఖాన్ (25), షారుక్ హుస్సేన్ (22), మహ్మద్ దిల్బర్ రజాక్ (26), జాగీర్ మియా (33) ఉన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా హెడ్ క్వాటర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ తుది నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. అలానే పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రేపటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

2025 సంవత్సరం భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో అమలు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ‘రిఫారమ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో తాజాగా ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పలు అంశాలను పోస్ట్‌ చేశారు. ఈ సంస్కరణలు 2047 నాటికి ‘వికసిత భారత్’ను సాకారం చేయడానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పారు. 13 కీలక రంగాల్లోని అమలు చేస్తున్న సంస్కరణలను ఆయన వివరించారు. ఈ సంస్కరణలు మధ్యతరగతి, రైతులు, కార్మికులు, యువత, చిన్న వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. ఈ సంస్కరణలు దేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తున్నాయని వెల్లడించారు. పన్నుల్లో పెద్ద మార్పు అనేది మధ్యతరగతికి పెద్ద ఊరట కలిగించిందన్నారు. పన్నుల విషయంలో 2025లో కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. ముందుగా GSTలో రెండు స్లాబ్‌లు (5%, 18%) అమలు చేశారు. ఇది గృహాలు, చిన్న వ్యాపారాలు, రైతులు, కార్మిక రంగాలపై భారాన్ని తగ్గించింది. రెండోది ఆదాయపు పన్ను ఉపశమనం. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు. 1961 ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌ను రద్దు చేసి, కొత్త 2025 యాక్ట్ తెచ్చారు.

45 రోజులు అని చెప్పాం.. 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపాం!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.20.77 కోట్లతో చేపట్టనున్న ఈ ఆధునీకరణ పనులు కోనసీమ కొబ్బరి రైతులకు పెద్ద ఊరట కలిగించనున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోనసీమ కొబ్బరి రైతుల కన్నీరు తనను కదిలించిందన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్‌తో వస్తామని చెప్పిన తాము.. 35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునీకరణకు అడుగులు వేశామని తెలిపారు. ముక్కోటి పర్వదినాన ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు.

కొత్త జోనల్‌ కమిషనర్లకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను (CURE) అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ‘క్యూర్’ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు , 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నగర ప్రక్షాళనపై అత్యంత స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ఫీల్డ్‌లో ఉండి ప్రజల సమస్యలను పర్యవేక్షించాలని, అప్పుడే పరిపాలన పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

హీరోగా ఎంట్రీపై అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్‌ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్‌ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సాంగ్ ఈవెంట్‌లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడిని.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని యాంకర్ అడగ్గా.. ఆయన దానికి స్పందిస్తూ… ‘అందరూ గుర్తు పెట్టుకోండి.. మనం సక్సెస్ ఫుల్‌గా ఒక దాంట్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. పొరపాటున కూడా అటు వైపు వెళ్తే ఇక మన పని అయిపోయినట్లే.. హ్యాపీగా మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవాలి, ఇప్పుడప్పుడే హీరోగా చేయాలనే ఆలోచన లేదు’ అని అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, హీరో విక్టరీ వెంకటేష్ కీ రూల్‌లో కనిపించనున్నారు.

అత్యంత రహస్యంగా అసిమ్ మునీర్ కుమార్తె వివాహం.. ఎవరితో జరిగిందంటే..

పాకిస్తాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన అసిమ్ మునీర్ కుమార్తె వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. మునీర్ కుమర్తె మహనూర్‌ను డిసెంబర్ 26న తన అబ్దుల్ రెహమాన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లి పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సైన్యంలో ముఖ్యులు, ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను విడుదల చేయలేదు. అబ్దుల్ రెహమాన్, అసిమ్ మునీర్ సోదరుడు ఖాసిమ్ మునీర్ కుమారుడు. అబ్దుల్ రెహ్మాన్ గతంలో పాక్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో పనిచేశాడు. ఆ తర్మాత, సైన్యం కోటాలో పాక్ సివిల్ సర్వీసుల్లో చేరాడు. ప్రస్తుతం, అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఆసిమ్ మునీర్‌కు నలుగురు కుమార్తెలు, ఇతడి మూడో కుమార్తె మహనూర్. ఈ వివాహానికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, ఐఎస్ఐ చీఫ్, రిటైర్డ్ జనరల్స్, సైన్యానికి చెందిన మాజీ చీఫ్‌లు హాజరయ్యారు. భద్రతా కారణాల వల్ల కేవలం 400 మందికి పైగా అతిథులు మాత్రమే వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.

 

Exit mobile version