8 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా
హైదరాబాద్‌లోని పోచారంలో 1978లో 27 ఎకరాల భూమి మీద 400 ప్లాట్లతో ఏర్పాటు చేసిన జీపీ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ లే అవుట్‌లో ఒక వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తనదేంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించినట్టు సొసైటీ సభ్యులు వాదించారు. ఈ వ్యవహారం సుమారు 8 ఏళ్లుగా కొనసాగుతూ, సొసైటీ సభ్యులు అనేక మార్ల ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తుదిగా సొసైటీ సభ్యులు ప్రజావాణి ద్వారా తమ ఫిర్యాదును హైడ్రా అధికారులకు తెలిపారు. ఫిర్యాదు దృష్టిలో ఉంచుకుని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి, ప్రహరీ గోడ అక్రమ నిర్మాణంగా ఉందని నిర్ధారించారు. అందువల్ల, హైడ్రా సిబ్బంది ప్రహరీ గోడను తొలగించి, స్థానికుల సమస్యకు చట్టపరమైన పరిష్కారం అందించారు. “8 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నాం, ఇప్పుడు హైడ్రా తీసుకున్న చర్యల ద్వారా సమస్య పరిష్కారమైంది . ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఆశిస్తున్నాం,” అని సొసైటి సభ్యులు తెలిపారు.
జగన్ వాస్తవాలు చెప్తుంటే మంత్రులు తట్టుకోలేకపోతున్నారు..!
తాజాగా వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రికా సమావేశంపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మాట్లాడిన వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని, వాటిని తట్టుకోలేక అధికార పక్ష మంత్రులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని ఆయన సీఎంపై పరోక్షంగా విమర్శించారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని అమర్నాథ్ అన్నారు. గూగుల్-రైడెన్ సంస్థతో ఒప్పందంలో ఉద్యోగాల గురించి జగన్ ప్రశ్నించారని, అలాగే గూగుల్-అదానీ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో జరిగిన చర్చలను ఆయన వివరించారని తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అదానీ పేరు చెప్పడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని, అదానీ పేరు చెప్తే జగన్‌కు మంచి పేరు వస్తుందనేది వారి బాధ అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
దుబాయ్‌లో సీఎం చంద్రబాబు.. యూఏఈ-ఏపీ మధ్య వాణిజ్య, సాంకేతిక బంధం బలోపేతం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా మూడవ రోజు యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో యూఏఈ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పెంపొందించుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రస్తుతం భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై నేతలు ప్రధానంగా చర్చించారు. పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించే అంశంపై దృష్టి పెట్టారు. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యూఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు.
మెదక్ జిల్లాకు చెందిన తల్లి-కూతురు దుర్మరణం
కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లా శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి–కూతురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతులు సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23)గా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. భర్త వేణు దుబాయ్‌లో పనిచేస్తుండగా, కుమారుడు వల్లభ్ అలహాబాద్‌లో చదువుకుంటున్నాడు. కుమార్తె చందన బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. అయితే.. దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా స్వస్థలమైన శివాయిపల్లికి వచ్చారు. పండుగ అనంతరం వేణు దుబాయ్‌కి తిరిగి వెళ్లగా, కుమారుడు వల్లభ్ కూడా అలహాబాద్‌కి వెళ్లిపోయాడు. నిన్న చందనను బెంగళూరులో దింపి, తాను దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో సంధ్యారాణి ఈ దుర్ఘటనకు గురయ్యారు. కర్నూలు వద్ద బస్సు మంటల్లో చిక్కుకోవడంతో తల్లి–కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వార్త తెలిసి శివాయిపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామస్తులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబంలోని ఇద్దరిని కోల్పోయిన వేణు, వల్లభ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. పవర్ యూనిట్ షట్ డౌన్
ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని ఢిల్లీలోని IGI విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వాస్తవానికి ఈ విమానం 5 గంటల 20 నిమిషాలకు విశాఖ చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక సమస్య రావడంతో తిరిగి ఢిల్లీ వెళ్లిపోయింది. విమానంలో పవర్ యూనిట్ షట్ డౌన్ అయినట్లు పైలట్ గుర్తించారు.
బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా.. ఆపరేటర్‌కు గాయాలు..!
నేడు ఉదయం కర్నూలు నగర సమీపాన జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు టూ వీలర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఇప్పటికే 19 మంది పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ప్రమాదం నుంచి 29 మంది బయటపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే మృతదేహాలను వెలికి తీసిన తర్వాత బస్సును రోడ్డుపై నుంచి తొలగించే సమయంలో అపశృతి చోటుచేసుకుంది.
ఈసారి బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పూర్తిగా సన్నాహాలు చేపట్టబడ్డాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,365గా ఉంది, అందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా.. ఇతరులు 25 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ముగ్గురు అబ్జర్వర్స్ పర్యటన చేసి ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈసారి ప్రతి బ్యాలెట్ యూనిట్‌లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఏర్పాటు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేయబడుతుందని, అలాగే ఓటర్లకు మొబైల్ తీసుకెళ్ళకూడదని, మొబైల్ డిపాజిట్ చేయాల్సిందని స్పష్టం చేశారు ఆర్వీ కర్ణన్.
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపుల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కోసం ఏకంగా 95,137 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల గడువు గురువారం (అక్టోబర్ 23) రాత్రి వరకు పొడిగించగా.. చివరి రోజు ఒక్కరోజే 4,822 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు నడవకపోవడం, కొన్నిచోట్ల బ్యాంకులు పనిచేయకపోవడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును పొడిగించిన విషయం తెలిసిందే.
విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..!
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ విల్లాస్ వెనుక ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకుల బృందం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకులలో ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16)గా పోలీసులు గుర్తించారు. ఈ ఏడుగురిలో విష్ణు, మణిరత్నం, కృష్ణ అనే ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు యువకులు మృతి చెందారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. నదిలో ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
