Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!

నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. కల్యాణమండపం, సబ్‌ స్టేషన్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ, పార్కు, షాదీ మహల్‌ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు టెక్స్‌టైల్‌ పార్క్‌ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అబద్ధాలు వినలేక నగరిప్రజలు పారిపోయారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ లేదని రోజా విమర్శించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు.

అగ్నికీలల్లో ఆరుగురు.. కొనసాగుతున్న రెస్క్యూ.. ఇవాళ ఎగ్జిబిషన్‌కు రావొద్దన్న పోలీసులు

హైదరాబాద్‌లోని నాంపల్లిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నాంపల్లిలోని ‘బచ్చాస్‌ ఫర్నీచర్‌ షోరూమ్‌’ గోదాంలో మంటలు చెలరేగి దాదాపు నాలుగు గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్నీచర్ గోదాంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో, అదే భవనంలో నివసిస్తున్న మూడు కుటుంబాలు అగ్నికీలల మధ్య చిక్కుకుపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం ఆరుగురు లోపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వాచ్‌మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) తో పాటు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పెద్దవారు ఉన్నారు. దట్టమైన పొగలు , మంటల కారణంగా లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది.

సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..

సాధారణంగా సీఎంల కాన్వాయ్ కోసం గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తూ ఉంటాం. అయితే, బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం ఏకంగా గంట పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కోసం శనివారం సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో వైశాలి ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కర్పూరి గ్రామానికి వచ్చారు. కర్పూరి గ్రామ్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఆయన కాన్వాయ్ ఆగకుండా ఉండేందుకు, ఆయన ప్రయాణ సమయంలో రైల్వే గేటును ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరిచే ఉంచాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. దీని వల్ల సమస్తిపూర్–ముజఫర్‌పూర్ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇరాన్‌పై ట్రంప్ దాడి చేయబోతున్నారా?

అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికన్ యుద్ధనౌకల ఉనికి పెరగడం, యుద్ధ విమానాల మోహరింపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మించి ప్రత్యక్ష సైనిక చర్య వైపు కదులుతున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ట్రంప్ పరిపాలన యంత్రాంగం ఇరాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే సైనిక ఎంపికలను పరిశీలిస్తోంది. ఇదే టైంలో అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మధ్యప్రాచ్యం వైపు వేగంగా కదులుతుండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.

పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..

బంగ్లాదేశ్‌కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా? అనే దానిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌పై ఐసీసీ వ్యవహరించిన తీరును విమర్శించారు.

ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మైదానంలోకి మాహీ బాయ్!

ధోనీ ఫ్యాన్స్‌ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. మళ్లీ మాహీ బాయ్ ఎప్పుడు మైదానంలోకి దిగి బ్యాట్‌ పట్టుకుంటాడో అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తెరదించుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి MS ధోని అభిమానులకు IPL ముఖ్యమైనది. ఎందుకంటే ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేది ఈ ఏడాదిలో జరిగే ఐపీఎల్‌లోనే కాబట్టి. దీంతో ఇప్పటి నుంచే మాహీ ఫ్యాన్స్ ఐపీఎల్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ధోని తన స్వస్థలమైన రాంచీలో 2026 IPL సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూఎస్‌లో గంటన్నర వైద్యానికి రూ.1.65 లక్షల బిల్లు.. వైరల్ అవుతున్న వీడియో!

అమెరికా అంటే అందరికీ అవకాశాల గని, విలాసవంతమైన జీవితం గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ అనారోగ్యం పాలైతే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. తాజాగా ఒక భారతీయ అమెరికన్ పంచుకున్న అనుభవం అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతోంది. కేవలం గంటన్నర సేపు ఆస్పత్రిలో గడిపినందుకు ఆయనకు ఏకంగా రూ.1.65 లక్షల బిల్లు వచ్చిందని ఆయన పంచుకున్న ఒక వీడియోలో వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పార్థ్ విజయ్‌వర్గియా అనే ప్రవాస భారతీయుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ షాకింగ్ వివరాలను వెల్లడించారు. క్రిస్మస్ రోజున తన భార్య, కుమార్తెతో కలిసి ఐస్ స్కేటింగ్ చేస్తుండగా పార్థ్ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. మోకాలికి గాయం కావడంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాలో అంబులెన్స్ ఖర్చు విపరీతంగా ఉంటుందని తెలిసి, గాయంతో ఉన్నప్పటికీ ఆయన టాక్సీలోనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ రూమ్ (ER)లో కేవలం గంటన్నర మాత్రమే ఉన్నారు. వైద్యులు ఒక ఎక్స్‌రే తీసి, సాధారణ క్రేప్ బ్యాండేజ్ కట్టారు. అయితే మనోడికి ఆస్పత్రికి వెళ్లి వచ్చిన మూడు వారాల తర్వాత బీమా సంస్థ నుంచి బిల్లు వచ్చింది. ఇన్సూరెన్స్ పోగా, కేవలం తన జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా $1,800 (సుమారు రూ.1.65 లక్షలు). ఆ సమయంలో తనకు అందించిన చికిత్సకు అంత భారీ మొత్తం వసూలు చేయడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. ఉచిత వైద్యానికి నేను వ్యతిరేకం!

తన తండ్రి వీరయ్య చౌదరి మరణం తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని సంగం డెయిరీ చైర్మన్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే సంగం డెయిరీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. యువ వయసులోనే భారీ బాధ్యతలు భుజాలపై పడినప్పటికీ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం సంగం డెయిరీని, తనను వ్యక్తిగతంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఏసీబీ అధికారులు నెల రోజుల పాటు డెయిరీలో తనిఖీలు నిర్వహించారని, అయితే సంగం డెయిరీకి గత 16 ఏళ్ల పాటు ఇతరులు చైర్మన్‌లుగా పనిచేసినా, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాతే కుట్రలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యలేనని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

 

Exit mobile version