Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ సహా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మావోయిస్టులకు సీఎం పిలుపు..
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చూపిస్తున్న త్యాగం, సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. గోషామహల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి సీఎం ప్రధాన అతిథిగా హాజరై, విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి, తొలి ప్రతిని డీజీపీ శివధర్‌రెడ్డికు అందజేశారు. పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి, పోలీసు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సీఎం చంద్రబాబు యూఏఈ టూర్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

రేపటి నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో సీఎం బృందం పర్యటిస్తోంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో వన్ టూ వన్ మీటింగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు హజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ కానున్నారు. రేపు దుబాయ్‌లో సీఐఐ రోడ్ షో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. దుబాయ్‌లో మూడవ రోజు AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. తొలి రోజు పర్యటనలో భాగంగా 22వ తేదీన ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు.

మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!

రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలతో బయటకు తీసుకువెళ్లి పదో తరగతి హాస్టల్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదైంది. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన అజయ్‌గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

పవన్ కళ్యాణ్ తప్పులేదు.. తగిన చర్యలు తీసుకుంటాం!

కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్‌ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్‌ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.

రంగంలోకి కేసీఆర్.. 40 మందితో బీఆర్ఎస్ క్యాంపెయినర్ లిస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ శక్తిని సమీకరించింది. నవంబర్‌ 11న జరగనున్న ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు పార్టీ భారీగా ముమ్మర ప్రచారానికి సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌, ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

హుస్నాబాద్ కు నర్సింగ్ కాలేజీ తేవడానికి చర్యలు తీసుకుంటా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సందర్శించారు. నూతనంగా నిర్మాణంలో ఉన్న 250 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన మంత్రి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. “సుమారు ₹82 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునాతన సదుపాయాలతో కూడిన 250 పడకల హాస్పటల్ నిర్మాణం జరుగుతోంది. హుస్నాబాద్‌ను ఆరోగ్యరంగంలో నెంబర్ వన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ పరామర్శ

రౌడీ షీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య పరామర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సహాయం చెక్కుతో పాటు 300 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డీజీపీ అందజేశారు. ప్రమోద్ భార్య మాట్లాడుతూ.. “డీజీపీ సార్ మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం మాకు తోడుగా ఉంటుందని నమ్మకం కలిగింది. నా భర్త లేని లోటు ఎప్పుడూ తీర్చలేరు, కానీ మా కుటుంబానికి జరిగిన విధమైన బాధలు మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోలీసులు పనిలో వెళ్తున్నప్పుడు సరిపడిన ఆయుధాలు కల్పించాలి” అని పేర్కొన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల సిగ్గు లేదు

బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. స్పీకర్ వద్ద అబద్దాలు చెబుతూ, పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా నీతి ఉందా?” అని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని కూడా విమర్శించారు. “విజయోత్సవాలకెక్కడానికి ముందు, ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యమంత్రి పని. మున్సిపల్ మంత్రి లేకపోవడంతో హైదరాబాద్ అనాధగా మారింది. నగరం చెత్తతో నిండిపోయింది” అని అన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు పెంచకపోవడం తగదు అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..

అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. సినిమాలకు చాలాకాలంగా గ్యాప్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గానే తన పెళ్లి ప్రకటన చేశాడు అల్లు శిరీష్. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి ఉండబోతోంది. అయితే నయనిక ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బయటకు రాలేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆమె ఫొటోను బయటపెట్టింది. దీపావళి సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో అల్లు శిరీష్ కు కాబోయే భార్య నయనిక కూడా వచ్చింది. వీళ్ళందరూ కలిసి దిగిన ఫొటోను ముందుగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Exit mobile version