Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పాక్‌పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్

దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్‌పై దాడుల్లో భారత వైమానిక దళం వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన అన్నారు. సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు.

కేరళ బస్ వైరల్ వీడియో.. నిందితురాలు షింజితా ముస్తాఫా అరెస్ట్…

కేరళలో ఇటీవల బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో, ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందలు రావడంతో 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ వీడియోకు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత, మానసికంగా కుంగిపోయిన దీపక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి తీరును అంతా ఖండించారు. కేవలం వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా.? ఒక వ్యక్తి ప్రాణాలు పోయేలా ప్రవర్తించాలా అని ప్రజలు యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం

అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.

కుక్కకు ‘బంగారం’ తూకం.. తప్పు తెలుసుకుని హీరోయిన్ బహిరంగ క్షమాపణలు

మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించడం ఒక ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తమ పెంపుడు కుక్కను తక్కెడలో కూర్చోబెట్టి ఒక వివాదానికి కారణమైంది టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య. అయితే కొంతమంది మొక్కు ప్రకారం అలా కుక్కను కూర్చోబెట్టడం తప్పు లేదంటే, మరికొంతమంది మాత్రం “అలా ఎలా చేస్తావు? దేవతలను అవమానించడమే” అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం మీద తాజాగా ఆమె స్పందించింది. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. “అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి, అలాగే క్షమాపణ చెప్పడానికి చేస్తున్నాను. మేము పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది, అది కరెక్ట్ కాదు అని. మేం పెంచుకునే కుక్కకి 12 ఏళ్లు, దానికి ట్యూమర్ సర్జరీ జరిగింది. అది రికవరీ అవ్వాలని నేను ఆ అమ్మవారిని మొక్కుకున్నాను. రికవరీ అయింది, నడుస్తోంది. మొక్కు చెల్లించాలని మా డాగ్ ని బంగారం తూకం వేయడం జరిగింది. కాబట్టి నేను అది ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఇంకా వేరే ఏమీ ఉద్దేశించి, ఎవరిని కించపరచాలని చేయలేదు.

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆ నిర్ణయంతో చలించిపోయా..

కృష్ణా జిల్లాలోని పెడన నియోజక వర్గం, పెదచందాల గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు ఆర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక, మృతుడి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. క్రియాశీలక కార్యకర్త రాయల్ కుటుంబానికి 5 లక్షల చెక్ అందించారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అవయవ దానం చేసిన ఘటన నన్ను ఎంతో చలించింది.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.. గుండె ధైర్యం చేసుకుని అవయవ దానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు.

“రిపబ్లిక్ డే” రోజు పెద్ద ఎత్తున దాడులకు పాకిస్తాన్, జైష్ కుట్ర..

రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ కుట్రకు ‘‘26-26’’ అని కోడ్ నేమ్ పెట్టినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.


గ్రేడ్‌లలో ఊహించని మార్పులు.. భారత క్రికెటర్ల జాబితా ఇదే!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌, అంతర్జాతీయ ప్రదర్శనలను ఆధారంగా చేసుకుని గ్రేడ్‌లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి గ్రేడ్‌లలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లు, యువ ఆటగాళ్లకు బీసీసీఐ సమానంగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేడ్ Aలో నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారని సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్ గ్రేడ్‌లో ఉన్నారు. స్థిరమైన ప్రదర్శనలే గ్రేడ్ A కాంట్రాక్టుకు కారణం. గ్రేడ్ Bలో అనుభవజ్ఞులైన స్టార్ ప్లేయర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో పాటు మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ ఈ గ్రేడ్‌లోకి ఉన్నారు.


ఏసీబీ వలలో మరో తిమింగలం.. 100 కోట్ల అక్రమాస్తులు..!

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ, తాజాగా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన వెంకట్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం వందల కోట్లలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ , హన్మకొండలోని ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో సుమారు ₹100 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో అధికారులు విస్తుపోయే రీతిలో ఆస్తులను కనుగొన్నారు. ఎల్‌బీ నగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో రెండు విలాసవంతమైన విల్లాలు, వివిధ ప్రాంతాల్లో 10 ప్లాట్లు , 14 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వెంకట్ రెడ్డి నివాసం , బ్యాంక్ లాకర్ల నుండి సుమారు 2 కిలోల బంగారం, ₹50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌ను అధికారులు గుర్తించారు. తన అధికారిక పదవిని అడ్డం పెట్టుకుని బినామీల పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టిన ఈ అధికారి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులను ముగించి, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.

“భారత్-యూఏఈ-ఇజ్రాయిల్” కూటమి.. సౌదీ-పాక్-టర్కీ ఇస్లామిక్ నాటోనే లక్ష్యమా..?

టారిఫ్‌ల పేరుతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. నాటోలో పెద్దన్నగా ఉన్న అమెరికా, ఇప్పుడు ఆ కూటమినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ వ్యవహారం కారణంగా యూరప్ దేశాలతో కయ్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికా రక్షణ ఉంటుందా అనే అనుమానాలు పశ్చిమాసియా దేశాలను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త సైనిక కూటమిలు పుట్టుకొస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో తమ రక్షణ కోసం మిడిల్ ఈస్ట్ దేశాలు, ఇతర దేశాలు కూటములు కడుతున్నాయి.

ఆడితే భారత్‌లోనే, లేదంటే స్కాట్లాండ్‌ను తీసుకుంటాం.. బంగ్లాకు ఐసీసీ వార్నింగ్..

T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్‌తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్‌ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది. ఐర్లాండ్ తన లీగ్ మ్యాచుల్ని శ్రీలంకలో ఆడుతోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ అభ్యర్థను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోర్డు ఓటింగ్‌లో ఈ ప్రతిపాదనకు 14-2 ఓట్ల తేడాతో వీగిపోయినట్లు సమచారం. భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, దాని స్థానంలో మరో జట్టును తీసుకుంటామని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డును హెచ్చరించింది.

 

Exit mobile version