Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన కాంబినేషన్‌గా మారబోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడిల సినిమా విడుదల తేదీపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చేలా ఈ ప్రకటన ఉంది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. అనిల్ రావిపూడి వంటి మాస్ డైరెక్టర్‌తో ఆయన కలయిక, ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడి తనదైన హిలేరియస్ టైమింగ్ మరియు మాస్ ఎలివేషన్స్‌తో చిరంజీవిని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ.

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్ -అఖిలేశ్‌.. కలిసి టిఫిన్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో కలిసి టిఫిన్ చేశారు. నగరంలోని రామేశ్వరం కేఫ్‌కు మధ్యాహ్నం చేరుకున్న ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామేశ్వరం కేఫ్‌లో అందించే వివిధ రుచుల టిఫిన్‌లను ఆస్వాదించిన కేటీఆర్, అఖిలేశ్ యాదవ్, ఆహార పదార్థాల నాణ్యతను ప్రశంసించారు. టిఫిన్ సందర్భంగా రాజకీయాలు, సమకాలీన పరిణామాలపై పరస్పరంగా చర్చలు జరిపినట్లు సమాచారం. టిఫిన్ అనంతరం ఇరువురు నేతలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.

కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్..

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ.3.45 లక్షలు కోట్ల వరకు అప్పు చేసాం, ఆ అప్పులు కూడా పీపీటీ రూపంలో సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికి తెలుసు, కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెడుతుందో ఎవరికి తెలీదని అన్నారు. అప్పుల ఆంధ్రగా రాష్ట్రం దూసుకు పోతుందని చెప్పారు.

క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్

తెలంగాణ రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అద్భుతంగా ముగిసింది. ఈ చారిత్రక ఘట్టంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  సరిగ్గా రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్‌ (RR) టీమ్ (సీఎం రేవంత్ రెడ్డి జట్టు), అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభంలోనే సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్ వరుసగా రెండు గోల్స్ సాధించి ఆధిపత్యం చెలాయించింది. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మైదానంలోకి దిగి ఆడటమే కాకుండా, ప్రత్యర్థుల రక్షణ వ్యవస్థను ఛేదించి ఒక గోల్‌ను కూడా సాధించారు. ఆ తర్వాత ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కూడా గ్రౌండ్‌లోకి దిగి తమదైన మ్యాజిక్‌ను చూపించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింగరేణి ఆర్‌ఆర్‌ 9 టీమ్ (సీఎం జట్టు) విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన సింగరేణి ఆర్‌ఆర్‌ 9 టీమ్‌కు ట్రోఫీని లియోనెల్ మెస్సీ స్వయంగా అందజేశారు. ప్రపంచ దిగ్గజ క్రీడాకారుడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడంతో సీఎం జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీని అందజేసి క్రీడాకారులను అభినందించారు.

కెప్టెన్ దీపిక వినతిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. వెంటనే చర్యలు

మంగళగిరిలో శుక్రవారం మధ్యాహ్నం అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని ఆయనను కోరారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రం లోపు అనుమతులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా ప్రతిపాదనలు రూపొందించారు. వెంటనే వీటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం సాయంత్రమే అనుమతులు జారీ చేశారు.

ఫైనాన్స్ పేరుతో మోసం..! స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ పై ఆగ్రహం

ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణానికి చెందిన స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం వల్ల అనేక మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంస్థ మోసపూరిత కార్యకలాపాలపై ఆగ్రహించిన బాధితులు, సంస్థ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంభంకు చెందిన నాగమణి, ఇషారమ్మ, ముబీనా వంటి పలువురు బాధితులు దాదాపు 16 నెలల క్రితం తమ కుటుంబ అవసరాల కోసం ఈ సంస్థలో రుణాలు తీసుకున్నారు. వారు క్రమం తప్పకుండా తమకు కేటాయించిన లీడర్‌కు ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల మళ్లీ ఆర్థిక అవసరాల నిమిత్తం సంస్థను లోన్ అడిగేందుకు వెళ్లిన బాధితులకు ఊహించని షాక్ తగిలింది.

ప్రపంచం ముందు పాక్ ప్రధాని నవ్వుల పాలైన 6 సందర్భాలు ఇవే..

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తుర్క్మెనిస్థాన్‌లో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. తుర్క్మెనిస్థాన్‌లో ఆయన పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాల పాటు ఎదురు చూడాలని చెప్పారు. కానీ ఆయన అధికారుల మాటలు వినకుండా పుతిన్ – ఎర్డోగన్ సమావేశం జరుగుతున్న గదిలోకి బలవంతంగా ప్రవేశించారు. ఈ సంఘటన తర్వాత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. నిజానికి గతంలో కూడా షాబాజ్‌పై ఇలాంటి ట్రోల్స్ అనేకం వచ్చాయి.సెప్టెంబరులో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు షెక్‌హ్యాండ్ కోసం షాబాజ్ షరీఫ్ వైపు వేగంగా కదులుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్‌ వచ్చాయి.

కేరళలో ఎల్‌డీఎఫ్ కోటను కూల్చిన బీజేపీ..

కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) కంచు కోటగా ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఎల్‌డీఎఫ్ నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. రాజధానిలో ఈ అధికార మార్పు లెఫ్ట్ ఫ్రంట్‌కు పెద్ద రాజకీయ దెబ్బగా చెబుతున్నారు. నిజానికి తిరువనంతపురం అనేది కేరళ పరిపాలనా రాజధాని మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఈ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా కాంగ్రెస్, వామపక్ష కూటమికి బలమైన కంచుకోటగా పేరుంది. కానీ తాజాగా మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఇక్కడి నుంచి విజయం సాధించడం రాష్ట్రంలో కొత్త చర్చకు కారణం అయ్యింది.

మెస్సీ రాకతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు మరుపురాని దృశ్యం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి నగరానికి రాగా, ఆయన రాకతో ఉప్పల్ స్టేడియం సందడిగా మారింది. మెస్సీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్టేడియంకు చేరుకోవడంతో ఉప్పల్ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మెస్సీ గౌరవార్థం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉప్పల్ స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి అవే సింగరేణి ఆర్‌ఆర్‌ (RR) టీమ్, అపర్ణ మెస్సీ టీమ్. సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అపర్ణ టీమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగమయ్యారు.

రాజా సాబ్ జనవరి 9కే.. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన నిర్మాత

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల మధ్య, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్‌లో సినిమా అనగానే, ప్రభాస్ అభిమానులు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను ఆశించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా, దాని రిలీజ్ విషయంలో చాలా కాలంగా గందరగోళం నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ప్రభాస్ పాన్-ఇండియా చిత్రాలైన ‘కల్కి’, ‘సలార్’ వంటి సినిమాల షూటింగ్‌ల షెడ్యూల్స్ కారణంగా ‘రాజా సాబ్’ విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో అనే అనుమానాలు, ప్రచారాలు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి.

 

Exit mobile version