Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి భారత్ కారణం.. పాక్ ప్రధాని ఆరోపణలు..

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లో దాడి చేసినప్పటికీ, ఆఫ్ఘాన్ నుంచి పనిచేస్తున్న అదే నెట్వర్క్ వానాలోని అమాయక పిల్లలపై దాడి చేసిందని షరీఫ్ ఆరోపించారు.

రేపు కేతు-చంద్ర గ్రహణం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..

గ్రహాలు, నక్షత్రరాశుల సంచారం ప్రతిరోజూ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ యోగాలన్నీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి అరుదైన, అశుభ యోగం రేపు (నవంబర్ 12న) ఏర్పడబోతోంది. రేపు సింహరాశిలో కేతువు, చంద్రుని కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారంలో అడ్డంకులను సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, ఈ గ్రహణ యోగం ఏ రాశులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాకిస్తాన్‌లో అసిమ్ మునీర్ సైనిక తిరుగుబాటు.. సైన్యం లేకుండానే పని కానిచ్చేశాడు..

పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘అసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది. అయితే, గతంలోని తిరుగుబాట్లకు అసిమ్ మునీర్ తిరుగుబాటుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గతంలో సైన్యం ద్వారా తిరుగుబాటు జరిగితే, ఈసారి మాత్రం రాజ్యాంగ మార్పు ద్వారా ‘‘రాజ్యాంగబద్ధం’’గా జరిగింది.

ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ బిగ్ షాక్..
మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానికి ఈ విషయాన్ని తెలియజేసిందని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ముంబైతో సహా 246 మునిసిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అయితే, ఈ నిర్ణయంపై ఎంవీఏ కూటమి భాగస్వాముల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. శివసేన (UBT) ప్రతినిధి ఆనంద్ దూబే, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చేసిందని విమర్శించారు. మహారాష్ట్రలో ఇతర పార్టీలను నిందించే ముందు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) ఎవరిపైనా ఆధారపడకుండా సొంతగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శివసేన(UBT), మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (MNS) మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై కాంగ్రెస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంఎన్ఎస్ కూటమిలో చేరితే మైనారిటీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఓట్లు పోతాయని కాంగ్రెస్ చెబుతోంది.

బెట్టింగ్ యాప్స్ కు మరో యువకుడు బలి

సంగారెడ్డి జిల్లాలో బెట్టింగ్‌ల కారణంగా యువకుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 3న సంగారెడ్డిలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాదం మరువక ముందే, బెట్టింగ్‌లలో నష్టపోయిన కారణంగా మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో నివాసముంటున్న అఖిల్ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ అప్పులు చేసి బెట్టింగ్‌లలో పెట్టుబడి పెట్టి, ఆ మొత్తాన్ని నష్టపోయాడు. ఈ నష్టం తట్టుకోలేక అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

షేక్ పేట్ లో లాఠీ ఝళిపించిన పోలీసులు

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ… నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా షేక్‌పేట డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్… శాంతియుతంగా జరుగుతుందనుకుంటే, షేక్‌పేట డివిజన్ లో సీన్ మారిపోయింది.. అక్కడ పోలింగ్ బూత్‌లు 4, 5, 6, 7, 8 వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్లు హడావిడి చేయడంతో… పోలీసులు వెళ్ళిపోవాలని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు..

బీహార్‌ ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనం.. అధికారంలోకి వచ్చేది ఈ కూటమే..

దేశంలో రాజకీయంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. అందరి చూపు కూడా బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారే దానిపై నెలకొంది. బీహార్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెంచింది. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశలుగా ఓటింగ్ నిర్వహించారు. తొలి విడతలో 65.08 శాతం నమోదు కాగా, రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ + జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమికి మధ్య హోరా హోరు పోరు జరిగింది.

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ కారణంగా పంటలకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ సహాయం, దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యల కోసం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.

వినూత్నంగా ‘టెలీ మానస్’పై అవగాహన.. చిన్నారిని అభినందించిన మంత్రి

మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’ యొక్క ట్రోల్ ఫ్రీ నంబరు 14416 స్పష్టంగా కనిపించేలా వేషం ధరించింది. బాల్య దశ నుంచే సామాజిక స్పృహను పెంపొందించే ఈ ప్రయత్నం పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. పలువురిపై కేసులు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను హైద‌రాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులపై మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్ లపై రెండు కేసులు నమోదు కాగా, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై మరో కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు హైదరాబాదు సిటీ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా సాగాలంటే ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు.

 

Exit mobile version