Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కొడుకు.. ప్రియుడితో కలిసి భర్త ని హతమార్చేందుకు కుట్ర..

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆలస్యంగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్‌పై అతని భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కొడవలితో పీక కోసేందుకు యత్నించినట్లు బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మొక్కజొన్న పంటకు మందు కొడదామని చెప్పి భర్తను పొలానికి తీసుకెళ్లిన ఈశ్వరమ్మ, అక్కడే ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!

విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీకు తెలిసినట్లుగా, ఇప్పటి వరకు రూ.50 వేల వరకు విలువైన వస్తువులను ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. భారత ప్రభుత్వం బ్యాగేజీ నియమాలు 2026ను రిలీజ్ చేసింది. ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు భారతీయ ప్రయాణికులు ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి రూ.75 వేల వరకు విలువైన వస్తువులను భారత్‌కు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. తాజా నియయాల ద్వారా విదేశాల నుంచి బహుమతులు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.

‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..

ప్రధాని నరేంద్రమోడీ మలేషియాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయన విందులో, 1975 నాటి బ్లాక్ బస్టర్ తమిళ సినిమా ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) నటించిన ‘‘నాలై నమదే’’లోని ఒక సాంగ్ ప్లే చేశారు. దీంతో, ప్రధాని మోడీ, అన్వర్ ఇబ్రహీం ఎంజీఆర్ అభిమాని అని గుర్తించారు. దీనిని సోషల్ మీడియాలో పీఎం మోడీ పోస్ట్ చేశారు. ‘‘నా స్నేహితుడు, ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన విందులో ఒక పాట, లెజండరీ ఎంజీఆర్ నటించిన సినిమా నాలైనమదే లోనిది. భారత్‌లో చాలా మందిలాగే, ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’ అని ట్వీట్ చేశారు. సినిమాలు, సంగీతం, ముఖ్యంగా తమిళ సినిమాల ద్వారా రెండు దేశాలు మరింత దగ్గరవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు మోడీ చెప్పారు.

‘ధురంధర్ 2’తో.. ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్!

సినీ ప్రేమికులకు, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి శుభవార్త. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఏర్పాటవుతున్న అల్లు సినిమాస్‌ థియేటర్‌ దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో గ్రాండ్‌గా ఓపెన్‌ కానుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్లు సెలెక్ట్ చేసుకున్న సినిమా.. థియేటర్ ఓపెనింగ్‌పై మరింత హైప్‌‌ను క్రియేట్‌ చేస్తోంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే ‘ధురంధర్‌ 2’. అదిత్య ధర్‌ దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్‌ మెయిన్‌ రోల్‌లో రూపొందుతున్న ఈ పాన్‌-ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌ మార్చి 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రిలీజ్‌తోనే అల్లు సినిమాస్‌లోని భారీ 75 అడుగుల వెడల్పు డాల్బీ సినిమా స్క్రీన్‌ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఇంగ్లండ్ కి చుక్కలు చూపించిన నేపాల్.. కేవలం 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా, ఫిబ్రవరి 8, 2026న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్, నేపాల్ మధ్య గ్రూప్ C మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ కి చుక్కలు చూపించింది నేపాల్. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ త్వరగా వికెట్లు కోల్పోయారు. అయితే జాకబ్ బెథెల్ (55), హ్యారీ బ్రూక్ (హాఫ్ సెంచరీ), విల్ జాక్స్ (39* off 18 బాల్స్)ల బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 రన్స్ సాధించింది. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ ఐరీ (2/23), నందన్ యాదవ్ (2 వికెట్లు) మంచి ప్రదర్శన చూపారు. నేపాల్ బౌలింగ్ యూనిట్ ఇంగ్లాండ్‌ను ఆపడంలో సక్సెస్‌ఫుల్‌గా కనిపించింది, కానీ లేట్ ఓవర్లలో విల్ జాక్స్ హిట్టింగ్‌తో స్కోర్ 185కి చేరుకుంది.

కొత్త జిల్లాలు.. ఉన్న జిల్లాల తొలగింపుపై సీఎం రేవంత్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా , రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిధిలో లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదని, అది యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా తాను స్పష్టమైన భరోసా ఇస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీలో కలకలం.. పార్కింగ్ కారులో మృ*తదేహాలు

ఢిల్లీ నగరంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని అందరూ భయాందోళనలకు గురైనప్పటికీ, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, , శివనారాయణలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలు లభ్యమైన కారు పీరాగడి ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉంచబడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కూకట్‌పల్లిలో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగురవేస్తూ ఒక బాలుడు విద్యుత్ షాక్‌కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక బాలుడు పతంగి ఎగురవేస్తుండగా, అనుకోకుండా ఆ పతంగి దారం (మాంజా) తెగిపోయింది. గాలిలో తేలుతూ వెళ్లిన ఆ పతంగి సమీపంలోని ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. అయితే, ఆ పతంగిని తీసుకునే ఆరాటంతో బాలుడు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పతంగిని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

‘ధురంధర్‌’ కలెక్షన్స్‌పై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘ధురంధర్‌’. ఈ చిత్రం కేవలం వసూళ్లలోనే కాదు, రికార్డుల వేటలోనూ సరికొత్త చరిత్రను లిఖించింది. అదిత్య ధర్‌ దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్‌ మెయిన్‌ రోల్‌లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్ర కలెక్షన్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు దక్కిన స్క్రీన్ల కంటే మరిన్ని థియేటర్లు అందుబాటులో ఉండి ఉంటే సినిమా వసూళ్లు ఊహకందని రీతిలో ఉండేవని అభిప్రాయపడ్డారు. చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఆ సంఖ్య కేవలం 9 వేల లోపే ఉందని ఆయన గుర్తు చేశారు. గతేడాది చైనాలో విడుదలైన ‘నె ఝా 2’ అనే చిత్రం ఏకంగా 2 బిలియన్ డాలర్ల (రూ.18వేల కోట్లు పైచిలుకు) వసూళ్లను సాధించిందని, దానికి కారణం అక్కడ ఉన్న థియేటర్ల సంఖ్యేనని అన్నారు. ‘ధురంధర్‌’ 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమై 115 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు పైచిలుకు) సాధించింది, 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. నిజానికి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, డార్లింగ్ ఫ్యాన్స్‌లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. డార్లింగ్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక విభిన్నమైన, రా యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తన కెరీర్లో మొదటిసారిగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక సీరియస్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. ఈ సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు సమాచారం.

 

Exit mobile version