Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

నవీన్‌ యాదవ్‌ గెలిస్తే జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి మలుపు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ… నవీన్‌ యాదవ్‌ విజయం జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్‌ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మున్సిపల్‌ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి నవీన్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి,” అని చెప్పారు.

విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం

మహాఘట్‌బంధన్‌లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… విపక్ష కూటమిపై ధ్వజమెత్తారు. బీహార్‌కు ఇంకో లాంతరు అవసరం లేదన్నారు. ఇంత వెలుతురు ఉన్నప్పుడు.. మనకు ఇంకో లాంతరు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని తమ మొబైల్ టార్చిలైట్లను ఆన్ చేసుకోవాలని కోరారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని మహాఘట్‌బంధన్ కూటమిని ఎగతాళి చేశారు.

దారుణం.. బస్సు లగేజీ క్యాబిన్‌లో రెండు మృతదేహాలు..

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో కూడా రెండు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంతకు ఆ మృతదేహాలు ఎవరివి..? అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద వాదనలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ క్యాబిన్‌లో మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి. అక్రమంగా ఓనర్‌కి తెలియకుండా దొడ్డిదారిన డబ్బులు తీసుకుని ఈ ఇద్దరు ప్రయాణికులకు క్యాబిన్‌లో చోటు కల్పించారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై అటు యాజమాన్యం, ఇటు డ్రైవర్, క్లీనర్‌లు స్పందించడం లేదు. తమకేమి తెలియదంటూ ముఖం చాటేస్తున్నారు.

క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్‌ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు ఉన్న విరాట్ సున్నాకే అవుట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌ వన్డేలో కోహ్లీ అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇవ్వడం.. ఇందుకు ప్రతిగా కోహ్లీ సైతం గ్లోవ్స్‌ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా స్టేడియాన్ని వీడాడు. కానీ, విరాట్ చర్య రిటైర్మెంట్‌కు సంకేతమనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక, ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్‌ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్‌ ఆడినా మనం ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్‌ కోహ్లీకి ఫేవరెట్‌ స్టేడియం అని చెప్పాలి. అక్కడ సెంచరీలు బాదిన చరిత్ర అతడికి మాత్రమే ఉంది. కాబట్టి, సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ జీర్ణించుకోలేకపోయారని తెలిపాడు. అయినా ఓ ప్లేయర్ కెరీర్‌లో ఇలాంటివి జరగటం కామన్ అన్నారు.

తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌.. ఎవరూ ఆఫీసుకు రావొద్దు..!

తిరువూరు వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్‌ ఎంపీ కేశినేని నాని వ్యవహారం రచ్చగా మారింది.. అయితే, తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిస్థానం సీరియస్‌ అయ్యింది.. సీఎం చంద్రబాబు వచ్చే వరకు ఇద్దరూ.. ఈ వ్యవహారంపై మాట్లాడవద్దు అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే కొలికపూడిని ఆదేశించింది పార్టీ అధిష్టానం.. అయితే, అంతకు ముందే టీడీపీ ఏపీ చీఫ్‌ పల్లా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్‌ కోరిన ఎమ్మెల్యే కొలికపూడి.. టీడీపీ ప్రధాన కార్యాలయానికి బయల్దేరారు.. కానీ, పార్టీ కార్యాలయానికి రావద్దు అంటూ టీడీపీ అధిస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అధిస్థానం ఆదేశాలతో తిరువూరులో ఉండిపోయారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మరోవైపు, అనారోగ్యంతో తన నివాసానికే పరిమితం అయ్యారు ఎంపీ కేశినేని చిన్ని..

రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..!

ఇటీవల కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓ కంపెనీలో పని చేస్తూ.. మరో కంపెనీలో రహస్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా డబుల్ జీతం తీసుకునే వారు ఎక్కువయ్యారు. దీనినే “మూన్‌లైటింగ్” అని అంటారు. సాధారణంగా ఇది కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది తీవ్ర నేరం. “మూన్‌లైటింగ్” తాజాగా అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పెద్ద ప్రమాదంలోకి నెట్టాయి. అమెరికా న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కీలకమైన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గోస్వామి 2022 నుంచే మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ గ్లోబల్ ఫౌండ్రీస్‌లో రహస్యంగా కాంట్రాక్టర్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు చోట్ల ఒకేసారి పని చేస్తూ, తన ప్రభుత్వ డ్యూటీ సమయాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.

దమ్ముంటే.. నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కొండి.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్..!

తనపై జరుగుతున్న ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, తప్పుడు ప్రచారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్‌ వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు తాను నార్కో అనాలసిస్ టెస్టుకు, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఫేక్ కాల్స్‌తో తన వ్యక్తిత్వ సహననానికి పాల్పడుతున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. దమ్ముంటే తనను ధైర్యంగా ఎదురుగా ఎదుర్కోవాలని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్ పేరుతో ఫేక్ కాల్స్ చేయించడం ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఈ నకిలీ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని భావిస్తున్నారేమోనని.. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో.? ఎవరు చేయిస్తున్నారో.? చెప్పాలని ఆయన సవాలు విసిరారు.

ముగిసిన నామినేషన్స్‌ విత్‌డ్రా.. బరిలో ఎంతమందంటే.?

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు నామినేషన్‌ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటినీ ప్రక్రియలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, శుక్రవారం 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. త్వరలోనే బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరగనుంది.

‘‘పోలీస్ నన్ను 4 సార్లు రేప్ చేశాడు’’.. సంచలనంగా మారిన వైద్యురాలి ఆత్మహత్య..

మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఎస్ఐ బడ్నేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

19 మంది సజీవదహనం.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్‌ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకర సంఘటనని.. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఆమె వివరించారు. మంటలు చెలరేగగానే అప్రమత్తమై 27 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోగలిగారని, ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. మృతుల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఆమె ప్రకటించారు.

 

Exit mobile version