Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..

అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా నిలబడుతుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామన్నారు. హోంమంత్రి అనితకు చేతకాకపోతే రాజకీయాలు మానుకో అని మండిపడ్డారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి సాక్షిగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు అన్నారు. రాజయ్యపేట గ్రామస్తుల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లిన టీడీపీ నేత.. కౌన్సిలర్నంటూ బెదిరింపులు..

కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. స్థానిక టీడీపీ నేత నారాయణరావు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను “ఇంటికి తీసుకెళ్తాను” అంటూ స్కూల్ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక, విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నారాయణరావును ప్రశ్నించగా, అతడు వారితో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. తాను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ అక్కడకి వచ్చిన వారిపై బెదిరింపులకు కూడా దిగాడని గ్రామస్థులు చెప్పారు.

మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ మోడల్లోనే జరుగుతుంది..

ఉద్దానం‌ విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావు.. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టాడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారు.. మెడికల్ కళాశాలల నిర్మాణం పీపీపీ మోడల్ లోనే జరుగుతుంది.. గత‌ ఐదేళ్లల్లో జగన్ ప్రభుత్వం ‌మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టలేదు.. ఐదు వేల‌కోట్లు పనులకు ఐదు వందల‌ కోట్ల పనులు చేశారు.. పులివెందులలో మాత్రమే జగన్ మెడికల్ కళాశాలను పూర్తి చేశారు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం లొ పది మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేస్తామన్నారు. జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదు.. ఆయన వచ్చి కట్టే వరకు విద్యార్థులు నష్టపోయారు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

రెండేళ్లలో ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి.. సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. నూత‌న ఆసుప‌త్రి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

అలాంటి నీచపు ఘటనలకు పాల్పడే వాడెవరైనా.. ఉక్కుపాదంతో అణచివేస్తాం.!

తుని రూరల్ గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలియడంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన స్పందిస్తూ.. జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అమానుష ఘటనలకు పాల్పడే వ్యక్తులెవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి హెచ్చరించారు.

పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్ చేరుకున్న సీఎం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ పర్యటనను ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి (22వ తేదీ) నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భాగస్వామ్య సదస్సు’కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.

రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టుల మూసివేత

తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్‌ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు.

కోదండ రామ్ పై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కోదండరామ్‌తో జరిగిన సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావంలో కోదండరామ్‌ పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన నిస్వార్థంగా, నిజాయితీతో రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని గుర్తుచేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఎలా నిరంకుశంగా మారిందో అందరికీ తెలుసని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్‌, టీజేఎస్‌ సహా ప్రజాసంఘాలన్నీ కలిసి 2023 ఎన్నికల్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో టీజేఎస్‌ సహకారం ఎంతో విలువైనది. దాన్ని మేము ఎప్పటికీ మరవం,” అని తెలిపారు.

గోల్డెన్ బాయ్‌కు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా..!

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదాను అందించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులకు మాత్రమే లభించే ఈ గౌరవ ర్యాంకును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల లిస్ట్ లో నీరజ్ కూడా చేరిపోయారు.

అందుకే.. చెక్ పోస్టులు మూసివేశాం..

ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్‌లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అన్నారు.

 

Exit mobile version