మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యదర్శులు అందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీలోపు ఎందుకు ఖర్చు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎరవిచ్చారు అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఫిభ్రవరి మొదటి, రెండవ వారాల్లో పెట్టి మార్చి 15వ తేదీకల్లా అంతా ముగించాలనుకుంటున్నాం.. మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే మీరు ఇలా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా మీకు.. అందరు మంత్రులు కూడా ఆలోచించాలి.. మీరు, మీ సెక్రటరీలు, విభాగ అధిపతులు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.
గ్రోక్‌ను గెంటేసిన ఆ రెండు దేశాలు.. ప్రపంచ కుబేరుడికి దిమ్మతిరిగే షాక్!
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కంపెనీ xAI యొక్క ప్రసిద్ధ AI చాట్‌బాట్ గ్రోక్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రోక్ AI నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ చిత్రాలను సృష్టించిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిని తాత్కాలికంగా నిషేధించాయి. కొందరు వ్యక్తలు గ్రోక్ AI లో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ చిత్రాలను సృష్టిస్తున్న క్రమంలో ఈ రెండు దేశాలు గ్రోక్ AI పై కఠినమైన చర్యలు తీసుకున్నాయి. గ్రోక్ టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంలో కొత్త ముప్పుగా మారిందని ఇండోనేషియా, మలేషియా దేశాలు చెబుతున్నాయి. గ్రోక్ ద్వారా అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ వ్యాప్తి చెందడంపై ఇటీవల భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వరద జలాల పేరుతో వాడడానికి వీలులేదు
తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించబోతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన సూచనల మేరకు ఆర్టికల్ 131 కింద త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని మంత్రి ప్రకటించారు. సాధారణంగా ఆర్టికల్ 32 కింద వేసే పిటిషన్ల కంటే, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఆర్టికల్ 131 కింద దావా వేయడమే సరైన మార్గమని కోర్టు అభిప్రాయపడిందని, దీని ద్వారా ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం సులభతరం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగులే ప్రభుత్వ సారథులు.. డీఏ జీవోపై సంతకం చేశా.. త్వరలోనే జిల్లాల పునర్విభజన
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చక్రం పదిన్నర లక్షల మంది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు మారినంత మాత్రాన వ్యవస్థ మారదని, గత ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఉద్యోగుల చేత తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం చేసే మంచి పనులను ఉద్యోగులు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అభినందించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ (DA) అంశంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. “మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. ఈరోజో, రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది” అని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం – నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో ట్విస్ట్.. మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు..
పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఓ ట్విస్ట్ వచ్చి చేరింది.. సాంకేతిక కారణాల దృష్ట్యా తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు.. అయితే, పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం.. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండి మేం చెబుతూనే ఉన్నాం అన్నారు..
సంక్రాంతి రోజు కొత్త ఆఫీసులోకి ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త కార్యాలయం(పీఎంఓ) దాదాపుగా సిద్ధమైంది. మకర సంక్రాంతి రోజు ఆయన ‘‘సేవాతీర్థ్’’ కాంప్లెక్స్‌కు మారే అవకాశం ఉంది. జనవరి 14న పండగ రోజు మార్పు జరగాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో పీఓంఓ, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రరేటియట్ ఉండేలా రూపొందించారు. ఈ మూడింటికి వేర్వేరు భవనాలను కేటాయించారు. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సౌత్ బ్లాక్‌లోనే ఉన్న పీఎంఓ కార్యాలయం తొలిసారిగా మరే ప్రాంతానికి మారుస్తున్నారు. పాత కార్యాలయం ఖాళీ అయిన తర్వాత సౌత్, నార్త్ బ్లాక్‌లను ‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’ అనే పబ్లిక్ మ్యూజియంగా మార్చనున్నారు.
ఈ నెల 18న మేడారంలో కేబినెట్ సమావేశం..?
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే, ఈ సమావేశం నిర్వహణ వేదిక విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాన్ని, ఈసారి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో, అక్కడే మంత్రిమండలి సమావేశం నిర్వహించడం ద్వారా పండుగ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది.
యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ ఫైర్ అయ్యారు. యువత లక్ష్యంతో, ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారు.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపును మనం స్మరిస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా యువత తమ లక్ష్యాలను సాధించేలా సహకరిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.. వాస్తవంగా ఏపీ యువత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. ఫీజు రీయింబర్స్‌మెంట్ 8 త్రైమాసికాలుగా పెండింగ్ లో ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో ఢిల్లీ సీబీఐ ముందుకు విజయ్
టీవీకే అధినేత, నటుడు విజయ్ ఢిల్లీలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తమ ఎదుట హాజరుకావాలని ఇటీవల సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని రాజకీయంగా కుదిపేసింది. పెద్ద ఎత్తున నాయకులు విమర్శలు గుప్పించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది.
పతంగుల పండుగకు హైదరాబాద్ రెడీ.. రేపటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. రేపటి (జనవరి 13) నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరవాసులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్‌కు రానున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిలవనుంది. జనవరి 16, 17, 18 తేదీలలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ నిర్వహించనుండగా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆకాశంలో ఎగిరే బెలూన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. మరోవైపు ఆధునిక టెక్నాలజీకి వేదికగా డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. జనవరి 16, 17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్ట్ జరగనుంది. వినూత్న డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
