Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

టీమిండియాలో విభేదాలు.. గిల్, జైస్వాల్ మధ్య మాటల యుద్ధం

టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డబుల్‌ సెంచరీ చేసే అవకాశం కళ్ల ముందు చేజారితే ఏ బ్యాటర్‌కైనా కోసం రావడం సహజం. వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వీ జైస్వాల్ (175) ఈరోజు కూడా మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే, విండీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ, రనౌట్‌ రూపంలో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రిండింగ్ అవుతున్నాయి. గిల్‌ పరుగు కోసం రాకపోవడంతోనే ఔటైన యశస్వీ.. చేతితో తలను కొట్టుకుంటూ స్టేడియం వీడాడు.

దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల.. షాకింగ్ నిజం చెప్పిన అమిత్ షా..

దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరిగిందని, హిందూ జనాభా 4.5 శాతం తగ్గిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు వల్ల ముస్లిం జనాభా పెరగలేదు. చొరబాటు వల్ల పెరిగిందని స్పష్టం చేశారు. దేశం మత ప్రాతిపదికన విభజించబడిందని.. అయితే.. భారత్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ నుంచి వైపుల నుంచి చొరబాట్లు జరిగాయని, దీని ఫలితంగా జనాభాలో ఇంత మార్పు వచ్చిందన్నారు.

హ్యాట్సాఫ్ సర్.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను కాపాడిన పొలీసులు

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ లో పోలీసుల సమయస్ఫూర్తి ఓ మహిళా ప్రాణాలను కాపాడింది. ఏవో కారణాలతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100కి కాల్ చేసి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు 5 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే మహిళ ఉరివేసుకుని ఉండటంతో కిందికి దించి పోలీసులు సీపీఆర్ చేశారు.

పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. పాపి కొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం..

గోదావరి నదిపై పాపికొండల మధ్యలో విహారయాత్రకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఎత్తైన పాపికొండల మధ్య.. బోట్లలో విహరిస్తూ.. ఆ నేచర్‌ను ఎంజాయ్‌ చేయడమే కాదు.. బోట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటాయి.. అయితే, వర్షాకాలంలో గోదావరి పోటెత్తిన సమయంలో ప్రతీ ఏడాది పాపి కొండల టూర్‌ నిలిపివేస్తుంటారు.. ఎప్పుడు వర్షాలు తగ్గడం.. గోదావరిలో నీటి ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టడంతో.. గోదావరి నదిపై పాపి కొండల విహారయాత్రకు ఇరిగేషన్ అధికారులు పచ్చజెండా ఊపారు. మూడు నెలలుగా వరదల కారణంగా నిలిచిపోయిన విహారయాత్రలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్‌ వద్ద నీటిమట్టం తగ్గడంతో ఇవాళ్టి నుంచి అనుమతులు ఇచ్చారు. దీనితో. నిర్వాహకులు పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను సిద్ధం చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మ వారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లడానికి 15 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో కొత్త బోటుకు అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే, పది రోజుల పాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బోట్లను విహారయాత్రకు పంపిస్తున్నారు. పర్యాటకుల భద్రత విషయంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టారు. దీంతో వీకెండ్ సెలవు దినాల్లో ఆహ్లాదకరంగా గడపాలని కోరుకునే పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఐపీఎస్ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

హర్యానాలో మంగళవారం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు. సూసైడ్‌లో మృతుడు పేర్కొన్న పేర్లు ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై వేటు వేసింది. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులపై సూసైడ్ నోట్‌లో కుల ఆధారిత వివక్ష, మానసిక వేధింపులు, బహిరంగ అవమానాలు, దౌర్జన్యాలపై సూసైడ్ నోట్‌లో మృతుడు ఆరోపించాడు.

రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..

పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారుల్ని పాక్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో లాహోర్ నగరం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కు మద్దతు నిలిచినందుకు వీరంతా, అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

సాయి సుదర్శన్‌ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ మెరిశాడు. మొదటి రోజు బ్యాటింగ్‌లో (87) అదరగొట్టిన సాయి.. రెండో రోజు ఫీల్డింగ్‌లో ఔరా అనిపించాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్‌లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ షాట్‌ ఆడగా.. ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సాయి ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. బంతి వేగంగా దూసుకురాగా.. ముందుగా సాయి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే బంతి సాయి సుదర్శన్‌ కుడి చేతికి తాకి ఆపై బాడీకి తాకింది. అనంతరం బంతి సాయి ఎడమ చేతిలో ఆగింది. దెబ్బ గట్టిగానే తాకినా.. అతడు బంతిని మాత్రం వదలలేదు. షాక్‌తో విండీస్‌ బ్యాటర్‌ జాన్ క్యాంప్‌బెల్ మైదానం వీడాడు. దాంతో 21 పరుగుల వద్ద విండీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. విండీస్‌ క్యాచ్ పట్టిన తర్వాత సాయి నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే భారత జట్టు ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. సాయి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ ‘సూపర్ క్యాచ్’, ‘సాయి సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భారత క్షిపణుల ముందు పాక్ అస్త్ర సన్యాసం చేయాల్సిందే..

దాయది దేశం పాకిస్థాన్ ఎన్ని కొత్త క్షిపణులు కొనుగోలు చేసిన అవి భారత అమ్ముల పొదిలో ఉన్న అత్యున్నత క్షిపణులతో పోల్చితే చాలా వెనకబడి ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. తాగా పాక్ AIM-120 AMRAAM, చైనీస్ PL-15 వంటి కొత్త క్షిపణులను కొనుగోలు చేస్తోంది. అయితే వీటితో పోల్చితే భారతదేశ క్షిపణులు చాలా ఉన్నతమైనవిగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. DRDO VSHORAD, Astra, Rudram, NRSAM, BrahMos-ER వంటి క్షిపణులు పరిధి, వేగం, కచ్చితత్వంలో పాక్ క్షిపణులతో కంటే చాలా చాలా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. మే, 2025 లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తలెత్తిన ఘర్షణ సమయంలో మన దేశం.. పాక్ ప్రయోగించిన క్షిపణులను సులభంగా తప్పించుకుంది.

ట్రంప్‌కు హఠాత్తుగా చైనాపై కోపం.. 100 శాతం టారిఫ్ ఎందుకు.?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది. రేర్ ఎర్త్ ఖనిజాలు సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఇతర అధునాతన టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, సుంకాలపై ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో, చైనా ‘‘అసాధారణంగా దూకుడు’’ వైఖనిని తీసుకుందని ఆయన ఆరోపించారు. చైనా చర్యలను ‘‘అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక అవమానం’’గా పిలిచారు. బీజింగ్ అదనపు చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు త్వరలో అమలులోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.

కులం పేరు చెప్పుకుని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చా: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పాలనా పరంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డుకు నేను ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డిల సహకారంతో 2014లో రూ.20 కోట్లు మంజూరు చేయించా. 2014లో నిధులు మంజురైతే 11 ఏళ్ల పాటు ఎందుకు పనులు పూర్తి చేయలేక పోయారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ నేనే రివ్యూ చేయాల్సి వస్తుందంటే.. సదాశివ పేట ప్రజలు ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 20 కోట్లు మంజూరైతే..11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇప్పటికీ పూర్తి చేయలేక పోయారు. ఇంకా 5 కోట్లు పనులు మిగిలి ఉన్నాయి’ అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

 

Exit mobile version