Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

350 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లు.. ఏపీ, తెలంగాణకు భారీ రైల్వే బడ్జెట్!

రైల్వే బడ్జెట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైల్వే అధికారులు, అన్ని రాష్ట్రాల మీడియాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్–బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, రాష్ట్రాల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులపై కీలక వివరాలు వెల్లడించారు. మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు ఈసారి రూ.7,611 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతాన్ని కలుపుతూ చెన్నై – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ “డైమండ్ కారిడార్” ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉందన్నారు.

పాక్ ఆర్మీకి ముచ్చెమటలు.. ఇద్దరు బలూచ్ మహిళ యోధుల వీరమరణం..

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ లిబరేషర్ ఆర్మీ(BLA) పోరాటం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ ఫైటర్ల ధాటికి పాకిస్తాన్ సైన్యం కూడా వణికిపోతోంది. ముఖ్యంగా, ఇద్దరు మహిళా ఆత్మాహుతి యోధులు చేసిన పోరాటం ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరికి సంబంధించిన వీడియో పాక్‌తో పాటు భారత్‌లో వైరల్‌గా మారింది. బీఎల్ఏ పాక్‌కు వ్యతిరేకంగా ‘‘ఆపరేషన్ హెరోఫ్’’ని ప్రారంభించింది. గ్వాదర్ ఫ్రంట్‌లో పాక్‌కు వ్యతిరేకంగా పాకిస్తానీ భద్రతా బలగాలపై ఇద్దరు మహిళలు జరిపిన పోరాటం జరిపారు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వలన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన బదులు, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.

అజిత్ పవార్ మరణంపై ఏదో సందేహం కలుగుతోంది.. దర్యాప్తు చేయాలన్న సంజయ్ రౌత్

దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని.. ఎందుకో తనకు జస్టిస్ లోయా మరణం గుర్తుకు వస్తుందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. తెరవెనుక ఏదో జరుగుతోందని.. కచ్చితంగా అజిత్ పవార్ అకస్మిక మరణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడిమాతో మాట్లాడారు. ఎక్కడో ఏదో జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. కచ్చితంగా అజిత్ పవార్ మరణం అనుమానాస్పదంగా ఉందని.. తెరవెనుక ఏదో జరుగుతోందని అనిపిస్తోందన్నారు. పవార్ కుటుంబం తిరిగి కలిసేందుకు సిద్ధపడుతున్నారని.. ఇంతలోనే బీజేపీ వ్యక్తులు నీటిపారుదల కుంభకోణం ఫైళ్లతో బెదిరించారన్నారు. 10 రోజుల్లోనే అనుమానాస్పదంగా మరణించారని పేర్కొన్నారు. దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే.. అచ్చం జస్టిస్ లోయా మరణం గుర్తుకొస్తుందన్నారు.

మొత్తనికి ధనుష్‌తో పెళ్లి వార్తలపై.. రియాక్ట్ అయిన మృణాల్ ఠాకూర్

కొద్ది రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మృణాల్ ఠాకూర్, ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తే కనిపిస్తోంది. ఫిబ్రవరి 14న వీరిద్దరూ ఒక్కటవుతున్నారని, రహస్యంగా నిశ్చితార్థం కూడా అయిపోయిందని రకరకాల కథలు అల్లేశారు. వీటిపై ఎట్టకేలకు మన ‘సీతమ్మ’ మృణాల్ స్పందించింది. తన స్టైల్లో గట్టిగా క్లారిటీ ఇచ్చింది.నా పని చూడండి.. పుకార్లు కాదు! అంటూ మృణాల్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా చెప్పింది.. ‘నేను ఎప్పుడూ నా సినిమాలతోనే అందరికీ పరిచయం కావాలని కోరుకుంటాను, ఇలాంటి పనికిమాలిన గాసిప్స్‌తో కాదు. కానీ ఈరోజు నా పేరును కొన్ని కట్టుకథలతో ముడిపెట్టడం చూస్తుంటే బాధగా ఉంది. నేను అనని మాటలు, నేను తీసుకోని నిర్ణయాలను నా మీద రుద్దుతున్నారు. ఇవన్నీ కేవలం ఎవరో సృష్టించిన కట్టుకథలు మాత్రమే’ అని మృణాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఫిబ్రవరి 20న ఆమె హిందీ సినిమా ‘దో దివానే షెహర్ మే’ రిలీజ్ అవుతోంది. అలాగే టాలీవుడ్‌లో అడివి శేష్‌తో కలిసి ‘డకాయిట్’ మూవీ చేస్తోంది. ఇలా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న తనకు, పెళ్లి చేసుకునే టైమ్ ఎక్కడుందని ఆమె సన్నిహితులు కూడా అంటున్నారు. సో.. మృణాల్ – ధనుష్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. పుకార్లు పుట్టించే వారికి మృణాల్ తన పోస్ట్‌తో గట్టిగానే చెక్ పెట్టింది.

లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగంపై రగడ.. మైక్ కట్ చేసిన స్పీకర్

లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా డోక్లాం ఇష్యూను రాహుల్‌గాంధీ లేవనెత్తారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మాట్లాడాలంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో ప్రధాని మోడీ కూడా కూర్చున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనికి రాజ్‌నాథ్‌సింగ్ కలుగ జేసుకుని ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని చెప్పారు. అయితే ఆ పుస్తకం పబ్లిష్ కాకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని స్పీకర్ అడిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మంత్రులు, సీనియర్‌ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. జాగ్రత్త.. వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పడకూడదని సూచించారు.

సజ్జనార్ జడ్జి కాదు, పోలీస్ అధికారి మాత్రమే..

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు.. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.. ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలని తెలిపారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ అయినా, ఇంకో అధికారి అయినా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా అని సూచించారు. సజ్జనార్ జడ్జీ కాదు , పోలీస్ అధికారి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జీ అయ్యాడేమో నాకు అయితే తెలియదని సెటైర్ వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సజ్జల, బొత్స అత్యవసర భేటీ..

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యవసరంగా భేటీ అయ్యారు.. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ ఎలా స్పందించాలనే అంశంపై నేతలతో సజ్జల, బొత్స అభిప్రాయాలు పంచుకున్నారు.

పాత సిమ్ కార్డుల నుంచి రూ.26 లక్షల విలువైన బంగారం సేకరణ.. షాకింగ్ వీడియో వెలుగులోకి

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగించే వారు. అయితే కొంత కాలం తర్వాత వాటిలో కొన్ని సిమ్ కార్డులను బయటపడేసేవారు. పాత బడినపుడు లేదా పాడై పోయినప్పుడు కొత్త సిమ్ కార్డు తీసుకునే వారు. కాగా ఓ వ్యక్తి మాత్రం అలా నిరుపయోగంగా ఉన్న సిమ్ కార్డుల నుంచి ఏకంగా రూ. 26 లక్షల విలువైన బంగారాన్ని సేకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కాగా వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన చైనాలో వెలుగుచూసింది. పాత సిమ్ కార్డుల నుండి బంగారం తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనితో పాత సిమ్ కార్డులను కొనాలనే ఆసక్తి పెరిగింది. అయితే, ఈ ప్రక్రియ సాధారణ ప్రజలకు హానికరం కావచ్చని ఆ చైనా వ్యక్తి హెచ్చరించాడు. క్వియావోగా గుర్తించబడిన ఆ చైనా వ్యక్తి గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిజౌ నగరంలో నివసిస్తున్నాడు. జనవరి 20, 2026న, క్వియావో సిమ్ కార్డ్ నుండి బంగారాన్ని తీస్తున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది.

 

Exit mobile version