మార్కెట్లో 20 నుంచి 25 రూపాయలు.. కానీ కష్టించే రైతుకు మాత్రం లభించేది కిలోకి 50 పైసలు మాత్రమే. నిత్యం వంటగదిలో వాడే టమోటా ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు కూడా ధరలు తగ్గినా.. మరీ రైతుకు 50 పైసలు ఇచ్చేంత కాదు. టమోటా రైతులు మార్కెట్ కి కూడా తేవడానికి వీలులేనంతగా రేట్లు పడిపోయాయి. దీంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు.
కర్నూలు జిల్లాలో టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి .జిల్లాలో పత్తికొండ ఆస్పరి ,ఆలూరు మండలాల పరిధిలో టమోటా విస్తారంగా సాగు చేస్తారు. మదనపల్లి మార్కెట్ తర్వాత పత్తికొండ మార్కెట్లో టమోటా ఎక్కువగా అమ్మకాలు కొనసాగుతాయి. ప్రతిరోజు 20 లారీలకు పైగా టమోటా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. గత మూడు రోజుల క్రితం కిలో రూపాయి.. అర్థ రూపాయి కూడా పలకడం లేదు. ధర సంగతి తెలిసి కొంతమంది అక్కడే పారవోసి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా టమోటా ధరలు ఈ విధంగా పడిపోవడంతో చాలామంది రైతులు తోటలోనే పంటను వదిలేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ధరల స్త్రీకరణతో కొనుగోలు చేసి రైతులను ఆదుకొని తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.