ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు 14417 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం నాణ్యత, మెనూ అమలు, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, విద్యాకానుక పంపిణీ, ఉపాధ్యాయుల గైర్హాజరు, ఇతర అకడమిక్ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ వెల్లడించింది.
కాగా మధ్యాహ్న భోజనం పథకంలో మెనూను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి ప్రతి శుక్రవారం పొంగలి, సాంబారు, కోడిగుడ్లు అందించాలని సూచించింది. అన్నం వడ్డించే బదులు వీటిని ప్రవేశపెట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు గిరిజన సంక్షేమ వసతి గృహాల మెనూలో అధికారులు కోత విధించారు. గతంలో వారంలో ఆరు రోజులు గుడ్డు, ప్రతిరోజూ పాలు అందించేవారు. సవరించిన మెనూ ప్రకారం.. వారానికి నాలుగు రోజులు మాత్రమే గుడ్డు, పాలు అందించనున్నారు.