ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు సిద్ధమని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు.
Read Also: మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
మరోవైపు రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా సాధన కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి వినతిపత్రం కూడా అందజేశారు. రాజంపేట పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఇటీవల వైసీపీకి చెందిన కువైట్ ఎన్‌ఆర్‌ఐలు కూడా అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.
