AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!

Tirupati Election Tensions

Tirupati Election Tensions

AP MPTC and ZPTC Elections: చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, నిరసనలు చోటుచేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు.​ తిరుపతి రూరల్ మండల పరిధిలోని కపిలేశ్వరస్వామి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన వెంకటపతి నగర్‌కు చెందిన బొర్రెడ్డివారి గజేంద్రనాథ్ రెడ్డి, కోనేరు ప్రసాద్ రెడ్డిలను తిరుపతి రూరల్ పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయి నగర్ పంచాయతీ లిటిల్ ఏంజెల్స్ స్కూల్ సెంటర్ వద్ద ఓటర్లతో గొడవపడుతూ ఉద్రిక్తత సృష్టిస్తున్న శశిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.​ మరోవైపు చంద్రగిరి మండలం అగరాల గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల నడుమ వివాదం నెలకొంది. ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు తుకాకుల దేవరాజుల రెడ్డిని చంద్రగిరి పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.​ఇక చంద్రగిరి టవర్ క్లాక్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డి సహా తొమ్మిది మంది నాయకులు ఆందోళన చేపట్టారు. కోటాల, నరసింగాపురం, అగరాల, ఐతేపల్లి, రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు వారిపై సీఆర్ నంబర్ 289/2026 కింద కేసు నమోదు చేశారు.

అయితే, ​ఆర్సీపురం మండలం కాలేపల్లి గ్రామంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే విషయమై తీవ్ర ఘర్షణ చేలరేగింది. సురవారిపల్లెకు చెందిన పి. వాసుదేవ రెడ్డి ప్రయాణిస్తున్న స్కోర్పియో వాహనాన్ని అడ్డుకుని, ఆయనను బయటకు లాగి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసమై సుమారు 30 వేల రూపాయల నష్టం వాటిల్లగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్. యశ్వంత్, ఎమ్. ధనంజయ రెడ్డి సహా 12 మందిపై ఆర్సీపురం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.​ఎర్రవారిపాలెం జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు దిగుతున్న పి. హేమంత్ కిషోర్ రెడ్డి, సి. గంగిరెడ్డి, వై. వెంకటరెడ్డి, పి. శివప్రసాద్‌లను వై.వి.పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. మొత్తంగా తిరుపతి రూరల్, చంద్రగిరి, ఆర్సీపురం, వై.వి.పాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఘర్షణలు, నిరసనలపై 6 కేసులు నమోదు చేసి, 29 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.