Speaker Ayanna Patrudu: తిరుపతిలో జరిగే జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జాతీయ మహిళ సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు. మహిళల అండగా నిలబడేలా మనం చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలి.. రాష్ట్రాలు, పార్టీలు వేరైన మహిళల కోసం అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి అన్నారు. మహిళలకు ఆస్తిలోనూ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ టీడీపీ.. మహిళల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబుది అని స్పీకర్ అయ్యన్న తెలియజేశారు.
అయితే, నా బాధను మనసు విప్పి చెబుతున్నాను.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు అని శాసన సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మనల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే.. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం.. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్ – నో పే’ విధానం అనుసరిస్తున్నారు.. కానీ, అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్ సభ స్పీకర్ మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గెలిచిన వారు గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న చెప్పుకొచ్చారు.