NTV Telugu Site icon

Tirupati Ruia Hospital: రుయాలో అమానవీయఘటన… అంబులెన్స్ దందా

Tpt

Tpt

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా.. రూ.10వేలు అవుతుందని చెప్పారు.

అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.ఈ క్రమంలో ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ.. పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనంతరం రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు.

తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ స్పందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని వివరణ కోరారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్టకరం. ఇలాంటి వ్యక్తుల‌ను వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేదు. మృత‌దేహాల విష‌యంలో వ్యాపారం చేస్తారా… దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? ఆసుపత్రి సిబ్బందే బెదిరింపుల‌కు పాల్పడ్డారన్న కోణంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించాం.

Read Also: Green india Challenge: ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ ప్రారంభం

విచార‌ణ‌లో ఎవ‌రి త‌ప్పు ఉన్నా వ‌దిలిపెట్టం. క‌ఠినంగా చ‌ర్యలు తీసుకుంటాం. మహాప్రస్థానం అంబులెన్సులు 24 గంట‌లూ ప‌నిచేసేలా త్వర‌లోనే ఒక విధానాన్ని తీసుకొస్తాం. ప్రీపెయిడ్ ట్యాక్సీల విష‌యాన్ని ప‌రిశీలిస్తాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృత‌దేహాల‌ను వీలైనంత‌వ‌ర‌కు మ‌హాప్రస్థానం వాహ‌నాల ద్వారానే ఉచితంగా త‌ర‌లించేలా చ‌ర్యలు తీసుకుంటాం అన్నారు. అత్యవసర ప‌రిస్థితుల్లో మృతుల కుటుంబ‌స‌భ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తాం. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సుల‌ను నియంత్రిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు అంబులెన్సుల య‌జ‌మానులు, డ్రైవ‌ర్లపై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఉన్నతాధికారుల‌ను ఆదేశించాం అన్నారు మంత్రి విడదల రజినీ.

తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి కుమారుడి మృత దేహాన్ని తండ్రి తన బైక్ పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్ పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్ లో దుస్థితిని అద్దం పడుతుందని ట్వీట్ చేశారు చంద్రబాబు.