NTV Telugu Site icon

Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. పది రోజుల పాటు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు.. ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం టోకెన్‌లను తిరుపతిలో 9 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం ద్వారా జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రోజుకు 50వేల చొప్పున వైకుంఠ ఏకాదశి టోకెన్‌లను జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తిరుమల స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవాణి టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో రోజుకు 2 వేల చొప్పున టిక్కెట్లు జారీ చేస్తామని.. మహాలఘు విధానంలో దర్శనానికి అనుమతిస్తామన్నారు. పది రోజులు పాటు ఆఫ్ లైన్ విధానంలో శ్రీవాణి టిక్కెట్ల జారీని నిలిపివేస్తామన్నారు. పది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని.. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు.

Read Also: Andhra Pradesh: ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’

తిరుమలలో డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని మార్పు చేశామని.. దీంతో ఉ.9:30 గంటలకే సర్వదర్శనం భక్తులకు నేరుగా దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ మార్పుపై మూడు రోజుల్లోనే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రతి నిత్యం వెయ్యి మంది భక్తులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించి వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 2న స్వర్ణ రథం, 3వ తేదీన చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహిస్తామని.. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ కలిగిన భక్తులు 24 గంటలు ముందుగా మాత్రమే తిరుమలకు రావాలన్నారు. దర్శన టిక్కెట్‌లో కేటాయించిన సమయానికి అరగంట ముందుగా మాత్రమే క్యూ లైనులోకి అనుమతిస్తామని తెలిపారు. జనవరి 2వ తేదీ వేకువజామున 1:40 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభిస్తామని.. వీఐపీలను కేవలం లఘు దర్శనానికి పరిమితం చేస్తామన్నారు. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనిమతిస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

Show comments